బాబుకు నో: ప్రధాని ఇంటి వద్ద ఎంపీల ఆందోళన, అరెస్టు
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అపాయింటుమెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మంగళవారం పిఎం నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది.
ప్రధాని డౌన్ డౌన్, బ్రిజెష్ ట్రైబ్యునల్ తీర్పులో తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు ఎంపీలను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నామా నాగేశ్వర రావు, గుండు సుధారణి, దేవేందర్ గౌడ్, నిమ్మల కిష్టప్ప, సుజనా చౌదరి తదితరులు ఉన్నారు.

చంద్రబాబు ఆగ్రహం
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధానమంత్రి పట్టించుకోవడం లేదని చంద్రబాబు అంతకుముందు నిప్పులు చెరిగారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు లోపభూయిష్టంగా ఉందని, రాయలసీమ ప్రాంతం ఎప్పుడు కరువుతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై ఎపిలోని పలు ప్రాంతాలు ఆధారపడి ఉన్నాయని, శ్రీలంక వెళ్లవద్దని తమిళులు పట్టుబడితే ఆగిపోయిన ప్రధాని, ఎపికి జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
కృష్ణా జలాల అన్యాయంపై తాము రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చామన్నారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ప్రధాని అపాయింటుమెంటు కోసం తాను ఆరుసార్లు ప్రయత్నించినా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అల్మట్టి ఎత్తువల్ల జరిగే నష్టాన్ని మన న్యాయవాదులు సరిగా చెప్పలేకపోయారన్నారు.
జైపాల్ రెడ్డిపై రేవంత్ ఫైర్
కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి హైదరాబాదులో మండిపడ్డారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు ద్వారా మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుందని, దీనిపై జైపాల్ రెడ్డి స్పందించాలన్నారు. సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించిన ట్రైబ్యునల్‌ను రద్దు చేయాలన్నారు. నీటి పంపకాల్లో సరైన వాటా రాబట్టుకోవాల్సిన అవసరముందన్నారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తే ఎక్కడ పదవి పోతుందోనని జైపాల్ భావిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఘన చరిత్ర కలిగిన రాయలసీమను విబజించే హక్కు సోనియాకు ఎవరిచ్చారన్నారు. తెలంగాణ కోసం డిమాండ్ చేస్తుంటే రాయల తెలంగాణ ఏమిటన్నారు. కొండగల్ నుండి చంద్రబాబు పోటీ చేస్తానంటే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉంటేందుకు తాను సిద్ధమన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. రాష్ట్రంలో గాడిదల పాలన కొనసాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications