టిడిపి జాతీయ పార్టీ వ్యూహం: ఢిల్లీకి చంద్రబాబు, ఎపికి నారా లోకేష్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడు నారా లోకేష్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలనే వ్యూహంతో ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే టిడిపికి జాతీయ పార్టీ గుర్తింపు తేవడానికి అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేసి, అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాను ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి, నారా లోకేష్‌కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అప్పగించడానికి చంద్రబాబు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. జాతీయ పార్టీ నేత హోదాలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలకు వెళ్తారని గాలి ముద్దు కృష్ణమ నాయుడి వంటి పలువురు టిడిపి నాయకులు అప్పట్లో అంటూ ఉండేవారు.
2019 నాటికి తెలుగుదేశం పార్టీ రాజకీయాలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలను నారా లోకేష్ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటారని చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ బాటలో నడవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. టిడిపిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు.

కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్ రాష్ట్రాలకే కాకుండా మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలకు విస్తరించడానికి కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ ఉంది. ఎపిలో అధికారంలో కూడా ఉంది. టిడిపికి జాతీయ హోదా రావాలంటే ఆరు శాతం ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఇందుకుగాను వచ్చే ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలని, కాంగ్రెసేతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని టిడిపి యోచిస్తోంది.
కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్‌ల్లో మహానాడు నాటికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అందుకు పార్టీ నాయకులతో పరిశీలకులను కూడా నియమించారు. ఈ నెల 10వ తేదీన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో పార్టీ మహానాడు తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతారు. ఇదంతా నారా లోకేష్ కనుసన్నల్లో నడుస్తోంది.
పార్టీ మహానాడును ఈసారి హైదరాబాదులోనే నిర్వహించాలని టిడిపి పొలిట్ బ్యూరో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మహానాడులో నారా లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications