బొజ్జలకు షాక్: చేతులు దులుపుకొన్న టీడీపీ
Bojjala Sudheer Reddy: వలంటీర్లపై తిరుపతి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వలంటీర్లను ఆయన స్లీపర్ సెల్స్‌గా, అసాంఘిక శక్తులుగా అభివర్ణించడం టీడీపీలో మంట పెట్టింది.
బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాళహస్తిలో పలువురు వలంటీర్లు నిరసనలకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో టీడీపీకి ప్రతికూలంగా మారాయి.

దీనితో దిద్దుబాటు చర్యలకు దిగింది తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం. బొజ్జల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించింది. ఇందులో పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వలంటీర్లకు మరింత మెరుగైన సదుపాయాలను కల్పిస్తామని తెలిపింది.
ఈ మేరకు టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. కొందరు వలంటీర్లు స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. వారు అరాచకాలు, ఆగడాలు సాగిస్తోన్నారని విమర్శించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వలంటీర్లపై సుధీర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని, అవి ఆయన వ్యక్తిగతమని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటన వలంటీర్లకు మరింత మెరుగైన వేతనాలను కల్పిస్తామని, వారిని తొలగించబోమని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గతంలో చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారని గుర్తు చేశారు. వలంటీర్లపై తమ పార్టీ వైఖరి ఇదేనని తేటతెల్లం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన 200 మందికి పైగా వలంటీర్లు ఇదివరకే సస్పెండ్ అయ్యారని తెలిపారు.












Click it and Unblock the Notifications