సీఎం జగన్ ట్రాప్ లో టీడీపీ స్ట్రాటజిస్టులు - మొత్తానికే మోసం..!?
వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. 45 ఏళ్ల అనుభవం ఉన్నా రాజకీయ వ్యూహకర్తలను నియమించుకున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ను వ్యూహకర్తలే గెలిపించారనేది టీడీపీ నమ్మకం. ఇప్పుడు వారి సహకారం తమకు అదనపు బలంగా మారుతుందని నమ్ముతున్నారు. కానీ, అక్కడే తేడా కొడుతోంది. జగన్ ట్రాప్ లో టీడీపీ చిక్కుకుందా అనే సందేహం మొదలైంది. టీడీపీ వ్యూహకర్తల వ్యూహాలు పార్టీ నేతల కంటే ముందుగానే వైసీపీకి చేరుతున్నాయి. గతంలో వైసీపీకి పని చేసిన వ్యూహకర్తలే టీడీపీ కోసం పని చేస్తుండటంతో..వారి పని తీరుపైన పూర్తి అవగాహన ఉన్న వైసీపీ తమకు అనుకూలంగా మలచుకుంటోంది. ఇప్పుడు ఈ వ్యవహారం టీడీపీ ముఖ్య నేతల్లో ఆందోళనకు కారణమవుతోంది.

40 ఏళ్ల పార్టీకి 40 ఏళ్ళ వయసు వ్యూహకర్తలు.
.
టీడీపీ స్థాపించి 40 ఏళ్లు అయింది. చంద్రబాబు రాజకీయ అనుభవం 45 ఏళ్లు. ఇప్పుడు జగన్ పోరాటం..వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ నమ్ముకున్న వ్యూహకర్తల వయసు 40 ఏళ్లు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పని చేసిన ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన వారే ఇప్పుడు టీడీపీకి వ్యూహకర్తలుగా చేరారు. అటు జగన్ కు అదే టీం సభ్యులు పని చేస్తున్నారు. గతంలో జగన్ గెలుపు కోసం పని చేసిన వారు కావటం..ఇప్పుడు తమకు మద్దతుగా నిలుస్తుండటంతో తమకు మేలు చేస్తుందని టీడీపీ అంచనా వేసింది. జగన్ వ్యూహాలు..బలాలు..బలహీనతలపైన వీరికి పూర్తి అవగాహన ఉండటంతో తమకు కలిసి వస్తుందని భావించారు. పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మకు తోడుగా తాజాగా శంతన్ సింగ్ చేరారు. ఆయన ప్రత్యర్ధులపైన ప్రచార వ్యూహాల్లో దిట్టగా పేరుంది. కానీ, ఆ ఎంట్రీ ఇప్పుడు పార్టీలో కొత్త సమస్యకు కారణం అవుతోంది. అక్కడే టీడీపీ ఒక లాజిక్ మర్చిపోయింది. జగన్ గురించి వీరికి అవగాహన ఉన్నట్లే..వీరిచ్చే సలహాల పైన జగన్ కు పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు ఇదే కొత్త సమస్యకు కారణమవుతోంది.

వైసీపీకి సమాచారం చేరుతుందనే అనుమానాలు.
.
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సమయంలో శంతన్ సింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు పార్టీలో రాబిన్ సింగ్ టీంలో పని చేస్తున్న పలువురు సిబ్బంది తాము పని చేయలేమంటూ బయటకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. అదే సమయంలో..పార్టీ అమలు చేయాల్సిన వ్యూహాలు ముందుగానే వైసీపీకి చేరుతున్నాయనే చర్చ ఇప్పుడు అసలు టెన్షన్ కు కారణం అవుతోంది. ఇలా సమాచారం లీక్ అవుతున్న విషయం పైన రాబిన్ శర్మ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇక, టీడీపీలో వ్యూహకర్తల కంటే ముందుగా పని చేసిన ఐ టీడీపీ ఇప్పుడు ఈ వ్యూహకర్తల కారణంగా ఇబ్బందులు పడుతోందని తెలుస్తోంది. పూర్తిగా వారిని పక్కన పెట్టేలా టీడీపీ నాయకత్వం పై ఒత్తిడి పెంచుతున్నట్లు చెబుతున్నారు. దీని పైన అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకొని పని చేస్తున్న తమతో వ్యవహరిస్తున్న తీరు పై ఐ టీడీపీ పార్టీ నాయకత్వం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

వ్యూహకర్తల పని తీరుపై అవగాహనతో సీఎం జగన్...
కందుకూరు సభ ప్లానింగ్ అంతా పార్టీ వ్యూహకర్తలు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సభలను వ్యూహకర్తల టీం మార్గదర్శకాల మేరకు పార్టీ శ్రేణులు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే 2019 ఎన్నికల కు ముందు జగన్ కోసం ఏ విధంగా సభలను ప్లాన్ చేసారో..ఇప్పుడు చంద్రబాబు సభలకు అదే ప్రణాళికలను అమలు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు కందుకూరు ఘటనతో ప్రచారం కోసం చేసిన హంగామాలో ఈ ప్రమాదం జరిగిందంటూ వైసీపీకి ఆరోపణలు చేసే అవకాశం దక్కింది. ఇప్పుడు టీడీపీ కోసం పని చేస్తున్న టీం గతంలో వైసీపీ కోసం పని చేసినదే కావటంతో వీరి వ్యూహాలు ఎలా ఉంటాయనేది సీఎం జగన్ కు పూర్తి అవగాహన ఉంది. అంతా ప్రశాంత్ కిశోర్ స్కూల్ లో శిక్షణ పొందిన వారే కావటం..అందునా ఇప్పుడు కూడా జగన్ వద్ద పీకే నుంచి వచ్చిన రుషి టీం పని చేస్తోంది. ప్రధానంగా శంతన్ సింగ్ ఎంట్రీ.. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాబిన్ శర్మ ఇప్పుడు ఏం చేస్తారు.. చంద్రబాబు కు ఎలా నమ్మకం కలిగిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications