35అంశాలు: యనమల, భేటీకి టీ ఎంపీలు, జగన్‌పై భగ్గు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదని, అందుకే సమావేశానికి రాలేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆ రాష్ట్ర ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలను ఆహ్వానించినప్పటికీ రాలేదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ అభివృద్ధిపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు.
బాబుతో సమావేశం అనంతరం అశోక గజపతి రాజు మాట్లాడుతూ... ఎంపీలతో ఏడాదికి ఒకసారైనా సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకు రావడంపై ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు. యనమల మాట్లాడుతూ... ఏపీ అభివృద్ధికి ఎంపీలు అందరి సమష్టిగా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. కేంద్రంతో మాట్లాడాల్సిన 35 అంశాలను ఈ సమావేశంలో గుర్తించామన్నారు.

వాటి గురించి సంబంధిత మంత్రులతో మాట్లాడాలని ఎంపీలకు సూచించామన్నారు. కేంద్రం నుండి అధిక నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలను పూర్తి చేయాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలకు రాష్ట్ర అభివృద్ధి పట్టనట్లుగా ఉందన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సమావేశం కాబట్టి రావాలని వారిని పిలిచామని, ఒక్కరు కూడా రాలేదన్నారు.
కేంద్రం నుండి అధిక నిధులు రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. ప్రాథమికంగా ఏపీ రాజధానికి రూ.5వేల కోట్లు అవసరమని గుర్తించామన్నారు. ఎంపీలందరు కేంద్రంపై సమష్టిగా ఒత్తిడి తేస్తామని గరికపాటి రామ్మోహన రావు అన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎంపీలు దేవేందర్ గౌడ్, గరికపాటి రామ్మోహన రావు, గుండు సుధారాణిలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications