తెలంగాణ కాంగ్రెసు ఫైర్: కెసిఆర్‌పై ఇక సమరమే

విలీనం విషయంలో మాట తప్పారని కాంగ్రెసు నాయకులు విమర్సిస్తున్నారు. విలీనం ఉండదంటూ సోమవారం కెసిఆర్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రి డికె అరుణ కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. కెసిఆర్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటపై నిలబడే వారిగా పేరున్న తెలంగాణ ప్రజల గౌరవానికి మచ్చ తెచ్చేలా కెసిఆర్ ప్రవర్తించారని ఆమె వ్యాఖ్యానించారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కెసిఆర్‌పై ఉందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్రను పోషించే సత్తా తమకుందన్నారు. తెరాస విలీనమైతే కాంగ్రెస్‌కే నష్టం జరిగేదని అన్నారు.
రాజకీయ వ్యూహాలతోనే కెసిఆర్ మాట తప్పారని పార్లమెంటు సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా కనబరచిన ధైర్యసాహసాలే కారణమన్నారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటూనే కాంగ్రెస్ నేతలను కెసిఆర్ తన పార్టీలో చేర్చుకోలేదా అని రాపోలు ప్రశ్నించారు.
తెలంగాణ ఇచ్చేదీ, తెచ్చేదీ తామేనని ప్రకటించి, ఆ మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందని, తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కెసిఆర్ మాత్రం మాట తప్పారని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. కెసిఆర్ తాము మొదటి నుంచీ అనుమానిస్తూనే ఉన్నామని, చివరకు అదే నిజమైందన్నారు. కెసిసఆర్ సంగతి అందరికీ తెలుసునని, అందుకే భగవంతుడు నాలుకకు ఎముక ఇవ్వలేదని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరాడేందుకు సోనియా సైన్యం సిద్ధంగా ఉందన్నారు. తెరాసను విలీనం చేయకున్నా తమకు సమస్య లేదన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా ఇంట్లో ఊడుస్తానని ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు తన పార్టీని ఎందుకు విలీనం చేయడం లేదని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే చీపురు పనైనా చేస్తానన్న కెసిఆర్ ఇప్పుడు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే చాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. కెసిఆర్ మాట మీద నిలబడి తన నిజాయితీని నిరూపించుకోవాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.
తెరాస కలిసిరాకున్నా కాంగ్రెస్‌కు ఢోకా లేదని మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ నమ్మక ద్రోహి అంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెరాస ఉద్యమ పార్టీ కానే కాదని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని, తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications