మేనమామ ఇంటికే కన్నం వేసిన టెక్కీ అరెస్టు
హైదరాబాద్: మేనమామ ఇంటికే యువకుడు తన స్నేహితుడితో కలిసి కన్నం వేసిన సంఘటన హైదరాబాదులో చేటు చేసుకుంది. దాంతో అతన్ని, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సొత్తు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు వివరాలు వెల్లడించారు. శ్రీ కృష్ణదేవరాయనగర్‌కాలనీలో నివాసముండే గంగాధర్‌రావు ఎన్‌ఫీసీ సంస్థలో ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. అతనికి వరుసకు మేనల్లుడయ్యే మాదాల వంశీకృష్ణది కృష్ణాజిల్లా రుద్రపాక గ్రామం.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే వంశీకృష్ణ తన జల్సాల కోసం మేనమామ ఇంట్లో దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్నాడు. 2013 జూన్ 12న మేనమామ ఇంటికి వచ్చి పడక గదిలోని మంచం కిందకు దూరాడు. గంగాధర్‌రావు తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగానే.. బెడ్‌రూంలోని బీరువా తాళాలను పగల గొట్టి 44 తులాల బంగారాన్ని తస్కరించాడు.

వీటిని తన స్వగ్రామం తీసుకుని వెళ్లి అక్కడే పెట్టి వచ్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల పరిష్కారం కాని కేసులను పరిశీలించిన క్రైం పోలీసులు ఈ చోరీ వ్యవహరంపై వివిధ కోణాల్లో విచారణ చేపట్టి బంగారం దొంగిలించింది వంశీకృష్ణ అని తేల్చారు.
అదుపులోకి తీసకుని ప్రశ్నించగా బంగారంలో కొంతభాగాన్ని తన స్నేహితుడు సత్యనారాయణకు ఇచ్చినట్లు మిగతా ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు వెల్లడించాడు. దీంతో మొత్తం 44 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. నిందితులు వంశీకృష్ణ, అతని స్నేహితుడు సత్యనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications