మహిళలకు ఉచిత బస్సు అమల్లో సమస్యలివే..? ఆ ఆప్షన్ ఎంచుకుంటే..!
ఏపీలో కూటమి సర్కార్ తమ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని జిల్లాల పరిధిలోనే అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తాజాగా ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త జిల్లాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేస్తే మాత్రం పలు సాంకేతిక ఇబ్బందులు తప్పేలా లేవు. చివరకు ఈ పథకం తుస్సుమన్నా ఆశ్చర్యం లేదనే చర్చ సాగుతోంది.
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూటమి సర్కార్ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని అంతా భావించారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా మరో చోటికి వెళ్లేందుకు మహిళలకు అవకాశం దక్కుతుందని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం జిల్లాల పరిధిలోనే ఈ పథకం అమలు చేస్తామని తేల్చిచెప్పేసింది. దీని వెనుక ప్రధాన కారణం ఆర్ధిక ఇబ్బందులే. ఇప్పుడు ఇదే కారణంతో మరిన్ని సమస్యలు తప్పేలా లేవు.

ఒక వేళ ప్రభుత్వం కొత్త జిల్లాల పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయాలని భావిస్తే కచ్చితంగా సమస్యలు తప్పేలా లేవు. ఎందుకంటే గతంలో ఉన్న ఉమ్మడి జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలుగా గత వైసీపీ ప్రభుత్వం విభజించింది. దీంతో అప్పట్లోనే ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ కొత్త జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తే సాంకేతికంగా రూట్ల విషయంలో ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి.

ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట నుండి విజయవాడలోని పాయకాపురం రావాలంటే... ఎన్టీఆర్ జిల్లాలోని విసన్నపేటలో బయలుదేరి ఏలూరు జిల్లాలోని లీలానగర్, కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా తిరిగి ఎన్టీఆర్ జిల్లాలోని పాయకపురం రావాల్సి ఉంటుంది. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలోని ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి వల్ల సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కనీసం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మహిళళకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని జనం కోరుతున్నారు.












Click it and Unblock the Notifications