సిఎస్ వద్దకు టి డ్రాఫ్ట్ బిల్లు: కిరణ్ ఏం చేస్తారు, రిజైనా?
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి(సిఎస్) అందింది. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి సురేష్ కుమార్ ఢిల్లీ నుండి తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లును తీసుకు వచ్చారు. సచివాలయానికి చేరుకున్న ఆయన సిఎస్‌కు టి ముసాయిదా బిల్లును అందించారు. ఐదు బండిల్స్‌తో ఉన్న తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తీసుకు వచ్చారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అభిప్రాయం చెప్పేందుకు అసెంబ్లీకి రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 23లోగా అభిప్రాయం చెప్పవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో సభ్యులందరికీ ముసాయిదా బిల్లు ప్రతులను ఇవ్వాలని స్పీకర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

కిరణ్ ఏం చేస్తారు?
రాష్ట్ర విభజనను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారనే చర్చ సర్వత్రా సాగుతోంది. సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పటి నుండి కిరణ్ విభజనను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే కేంద్రాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. ఢిల్లీ పెద్దలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చించినప్పుడు కూడా కిరణ్ బలంగా సమైక్యవాదాన్ని వినిపించారు.
ఈ రోజు(గురువారం) ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ హైదరాబాదుకు వచ్చిన విషయం తెలిసిందే. కిరణ్ ఆయనతో అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఆ భేటీలోను కిరణ్ సమైక్యవాదాన్ని బలంగా వినిపించారు. తెలంగాణపై వెనక్కి వెళ్లమని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని డిగ్గీ చెప్పినా విభజనకు తాను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని కిరణ్ తేల్చి చెప్పారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బిల్లు రాష్ట్రానికి రావడంతో కిరణ్ ఏం చేస్తారనే చర్చ సాగుతోంది. అసెంబ్లీకి బిల్లు వస్తే కిరణ్ దానిని ఓడించే ప్రయత్నాలు చేస్తారా? లేక సభలోనే రాజీనామా చేస్తారా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉండగా విభజన జరగదని ఆయన చెబుతున్నారు. మరోవైపు అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీకి టి బిల్లు వస్తే నిరసన వ్యక్తం చేసేందుకు కిరణ్ సభలోనే రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా సాగింది. అంతేకాకుండా అసెంబ్లీని రద్దు చేసే అంశం పైనా కిరణ్ ఆలోచన చేస్తున్నట్లు మంత్రి టిజి వెంకటేష్ బుధవారం చెప్పారు.












Click it and Unblock the Notifications