సిటీలో అనధికార బంద్: పిల్లలకు ఆటవిడుపు (పిక్చర్స్)
హైదరాబాద్: పోలింగ్ సందర్భంగా హైదరాబాదులో బుధవారం బంద్ వాతావరణం నెలకొంది. వ్యాపార సంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. రోడ్లు ఖాళీగా కనిపించాయి.సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అలాగే భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ శాతాన్ని పొంపొందించేందుకు బుధవారం హైదరాబాద్ వ్యాపార సంస్థలను మూసివేయాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ సోమేశ్‌కుమార్ అదేశించారు.
బుధవారం నగరంలో చిన్నాచితక వ్యాపార సంస్థలు మొదలుకుని బడా వ్యాపార మాల్స్ వరకు మూతపడ్డాయి. దీంతో హైదరాబాద్‌లో అనధికార కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. అంతేగాక, నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే పలు మెయిన్ రోడ్లు కూడా బోసిబోయాయి. నగరంలో పలు చోట్ల టీ, టిఫిన్ కోసం కూడా జనం అవస్థలు పడాల్సి వచ్చింది. పోలింగ్ ఆరు గంటలకు ముగించాల్సి ఉండగా, సాయంత్రం అయిదు గంటల నుంచి పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు క్రమంగా పెరిగాయి.
ఇదివరకు పలు పార్టీలు బంద్, పాతబస్తీలో అల్లర్ల నేపథ్యంలో కూడా న్యూ సిటీలోని పలు ప్రాంతాల్లో యదేచ్చగా తెరిచి ఉన్న వ్యాపార సంస్థలు పోలింగ్ కారణంగా బుధవారం గల్లీగల్లీల్లో పాన్‌షాప్‌లకు తాళాలు దర్శనమిచ్చాయి. అత్యవసర సేవలైన మెడికల్, షాపులు పెట్రోల్ బంక్‌లు మినహా మిగిలిన సంస్థలన్ని మూతపడ్డాయి. పాతబస్తీలో కొన్ని పెట్రోల్ బంక్‌లు కూడా మంగళవారం అర్థరాత్రి నుంచి మూసివేశారు.

బంద్ వాతావరణం
పోలింగ్ సందర్భంగా హైదరాబాద్‌లో బంధ్ వాతావరణం నెలకొంది. దుకాణాలు, విద్యా సంస్థలు మూత పడ్డాయి. రోడ్లు ఖాళీగా కనిపించాయి.

రోడ్లు ఖాళీ...
పోలింగ్ సందర్భంగా బుధవారం సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి.

పిల్లలకు ఆటవిడుపు..
రోడ్లు ఖాళీగా ఉండడంతో హైదరాబాద్ వీధులు పిల్లలకు ఆటవిడుపుగా మారాయి. వారి ఇష్టారాజ్యంగా వినోదించారు.

కొత్త ఓటర్లే కావచ్చు..
ఓటేయడానికి యువత ఆసక్తి కనబరిచినట్లు అనిపిస్తోంది. అయితే, హైదరాబాదులో పోలింగ్ కూడా తక్కువే జరిగింది.

ఓటు కోసం క్యూ..
హైదరాబాదులోని చిక్కడపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి పురుషులు ఇలా బారులు తీరారు.

మహిళలు కూడా...
హైదరాబాదులోని చిక్కడపల్లిలోని ఓ పోలింగ్ కేంద్రంలో తామేమీ తక్కువ తినలేదంటూ మహిళలు ఓటేయడానికి క్యూ కట్టారు.

భారీ తనిఖీలు...
పోలింగ్ సందర్భంగా హైదరాబాదులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరంతరం తనిఖీలు కూడా చేపట్టారు.

ఓటరు కార్డులతో...
ఓటరు కార్డులతో యువతులు ఇలా ఉత్సాహంగా కనిపించారు. తొలి సారి వారు ఓటు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆ ఆనందం వారిలో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications