కేసీఆర్ మాజీ మంత్రుల్ని,ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేశారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తదితరుల పైన కేసు నమోదు చేయనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. హౌసింగ్ కుంభకోణానికి సంబంధించి పలువురు నేతల పైన కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 2004 - 2014 వరకు రూ.300 కోట్ల మేర స్కాం జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ ఏడాది జూలైలో దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లోని 32 గ్రామాలలో సీఐడీ విచారణను ముగించింది. ఇందుకు సంబంధించి దాదాపు వెయ్యి మంది పైన కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

నిందితులలో సర్పంచులు, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పై స్థాయి వారి పైన కూడా కేసులు నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వందలాది గ్రామాల్లో సీఐడీ విచారణ ముగిసేందుకు చాలా కాలం పట్టవచ్చునంటున్నారు.
ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, అధికారుల పైన జ్యూడిషియల్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2004 నుండి 2014 వరకు 24 లక్షల ఇళ్లను తెలంగాణలో నాటి ప్రభుత్వం నిర్మించినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. కేవలం 2007-2009 మధ్యనే పద్నాలుగు లక్షల ఇళ్లను నిర్మించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారీ అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications