కేంద్రం సాయం కోరనున్న తెలంగాణ ప్రభుత్వం, లేఖ
హైదరాబాద్: రైతుల రుణమాఫీ విషయంలో కేంద్రం సహకారం కోరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీ విషయమై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. శుక్రవారం ముంబైలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ రాజన్‌తో తెలంగాణ ప్రభుత్వ అధికారులు సమావేశమై రైతు రుణమాఫీకి సహకరించాలని కోరారు.
ఈ బృందంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వి నాగిరెడ్డి తదితరులు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు. ఆర్‌బీఐ గవర్నర్ స్పందనను వివరించారు.

రుణాలను దీర్ఘకాలికంగా రీషెడ్యూలు చేయడాన్ని బ్యాంకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, పాత బకాయిలు చెల్లించకుండా 2014 ఖరీఫ్ సీజన్‌లో పంటరుణాలను ఇవ్వలేమని చెబుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేశారని, ప్రస్తుత పరిస్థితిలో రుణమాఫీ కింద రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.10 వేల కోట్లను ఒకే విడతలో బ్యాంకులకు విడుదల చేసే అవకాశం లేదని అధికారులు చెప్పారని సమాచారం.
బకాయిలతో ముడిపెట్టకుండా రైతులకు కొత్తగా ఖరీఫ్ పంటరుణాలను ఇచ్చేలా సహకరించాలని, ఆ మేరకు ఆర్‌బీఐకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లుగా సమాచారం. బ్యాంకు రుణాల మాఫీపై ఇంకా మార్గదర్శకాలు రూపొందించలేదని, లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో ఖరీఫ్ రుణాల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా మంజూరు చేసేలా ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు తక్షణం ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరదామని తీర్మానించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications