ఏపీ ఎన్నికల ఫలితాలపై ఒక్కమాటలో తేల్చేసిన కోమటిరెడ్డి!
ఏపీలో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య హోురాహోరీగా జరిగిన ఎన్నికల్లో గెలుపెవరిదనే విషయంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందా? లేదంటే టీడీపీ కూటమి అధికారాన్ని దక్కించుకుంటుందా? అనే చర్చ నడుస్తోంది. బెట్టింగుల గురించి ప్రత్యేకంగా రాయాల్సిన అవసరంలేదు. కొన్ని ప్రాంతాల్లో పోటీలుపడి మరీ పందాలు కాస్తున్నారు. తాజాగా ఏపీ ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజల నాడి అంతుపట్టకుండా ఉంది
తన జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కోమటిరెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందించగా, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడి సస్పెన్స్ గా ఉందని, రెండోసారి వైసీపీకి అధికారం కట్టబెడతారా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోందన్నారు. ఏ సర్వేలోను ప్రజానాడి బయటకు రాలేదని, తాను కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై తన అంచనాను చెప్పలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.

మెజారిటీ సీట్లు కాంగ్రెస్ వే
తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే గట్టి పోటీ జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు సమానంగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, మెజారిటీ సీట్లు మాత్రం కాంగ్రెస్ కే వస్తాయన్నారు. భువనగిరి నుంచి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ గెలవబోతున్నారని, భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ప్రజలు మంచి తీర్పు ఇస్తారన్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చి నిలబెట్టుకుంటుందని, ప్రజలు తమవైపు ఉన్నారని కోమటిరెడ్డి అన్నారు. మెజారిటీ ఎంపీ స్థానాలు కాంగ్రెరస్ పార్టీవేనని తేల్చిచెప్పారు. ఇండియా కూటమి దేశవ్యాప్తంగా బలంగా పుంజుకుందని, బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయడం ఈసారి అంత సులువు కాదన్నారు. మొదట్లో బీజేపీ హవా కొనసాగినప్పటికీ ఉత్తరాదిన ఇండియా కూటమి బాగా పుంజుకుందన్నారు.












Click it and Unblock the Notifications