జనసేన జడ్పీటీసీ కోసం వెతుకుతున్న తెలంగాణ పోలీసులు
జనసేన పార్టీ జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు కోసం తెలంగాణ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకులను, ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నించారంటూ ఆయనపై అధికారులు కేసు నమోదు చేశారు. రొయ్యల వ్యాపారంలో ఉన్న జయప్రకాష్ నాయుడు చెరువుల్లో చేప, రొయ్య పిల్లలు పెంచడానికి తెలంగాణ మత్స్య శాఖ రెండు నెలల క్రితం 113 కోట్ల రూపాయలకు పిలిచిన టెండర్లలో పాల్గొన్నాడు. మరికొందరితో కలిసి 12 జిల్లాల్లో టెండర్లను దక్కించుకున్నాడు.

చేప, రొయ్యపిల్లల సరఫరా కాంట్రాక్ట్ కోసం
టెండర్లను దక్కించుకున్న తర్వాత వాటికి బ్యాంక్ గ్యారంటీలు సమర్పించారు. ఏపీలోని పాలకొల్లులో ఓ బ్యాంకు నుంచి వీటిని తీసుకొని వాటి విలువలను ఫోర్జరీ చేశారు. బ్యాంకర్ల సంతకాన్ని ఫోర్జరీ చేయడంతోపాటు నకిలీ స్టాంపులతో కలిపి వీటిని తెలంగాణ మత్స్య శాఖ ఉన్నతాధికారులకు సమర్పించారు.
వీటిపై ఆరోపణలు రావడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారణకు ఆదేశించారు. పాలకొల్లులో నాయుడు తీసుకున్న బ్యాంకు గ్యారంటీలను, ఇతర వివరాలను తెలంగాణ అధికారులు సేకరించారు. బ్యాంకర్ల నుంచి తీసుకున్న మొత్తం లక్షల రూపాయల్లో ఉండగా వీరు కోట్ల రూపాయల్లో సమర్పించారు. ఈ వివరాల ప్రకారం అవి నకిలీవిగా నిర్థారించారు.

టెండర్లు రద్దుచేసిన మత్స్య శాఖ
మంచిర్యాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, జిల్లాల్లో చేప పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్ల ఒప్పందాన్ని రద్దుచేశామని, టెండర్ బిడ్లు కూడా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ మత్స్య శాఖ డీడీ ప్రకటించారు. బ్యాంకు గ్యారంటీ పత్రాలు నకిలీవి సమర్పించడంతో రద్దు నిర్ణయం తీసుకున్నట్లు డీడీ వెల్లడించారు. నకిలీ పత్రాలతో మోసం చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలకు వీరు నకిలీ పత్రాలు సృష్టించినట్లు అధికారులు భావిస్తున్నారు.

వీరవాసరం నుంచి జడ్పీటీసీగా
తూర్పుగోదావరి జిల్లా వీరవాసరం నుంచి జనసేన పార్టీ తరఫున జడ్పీటీసీగా జయప్రకాష్ నాయుడు ఎన్నికయ్యాడు. ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కిన ఒకే ఒక్క జడ్పీటీసీ ఇది. నిరంతరం ప్రభుత్వంపై పోరాడుతున్న తమ నేత పవన్ కల్యాణ్ కు ఇటువంటి నాయకుల తీరువల్ల చెడ్డ పేరు వస్తుందని, వివరాలు తెప్పించుకొని పార్టీ నుంచి బయటకు పంపించే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని జనసేన కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఈ తరహా నాయకులను పార్టీ నుంచి బహిష్కరించాలంటున్నారు.












Click it and Unblock the Notifications