టీపై సోనియా పట్టు: కిరణ్ రెడ్డి కౌంటర్ వ్యూహం?
న్యూఢిల్లీ: శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రతిపాదించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్టుపడుతుండగా, దాన్ని ఎదుర్కోవడానికి కిరమ్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రతివ్యూహాన్ని రచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. శుక్రవారం జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ బిల్లును శీతాకాలం పార్లమెంటు సమావేశంలో ప్రతిపాదించే విషయంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, బిల్లు తమ దాకా రాక ముందే శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేసి జాప్యం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణపై కాంగ్రెసు కోర్ కమిటీ శుక్రవారం సాయంత్రం సమావేశమై చర్చించింది. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రతిపాదించే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. శీతాకాలం సమావేశాల్లో ప్రతిపాదించడంలోని సాధ్యాసాధ్యాలపై మల్లగుల్లాలు పడినట్లు చెబుతున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సమర్పించిన జివోఎం నివేదికపై కూడా చర్చించారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ సమావేశంలో 40 నిమిషాల పాటు పాల్గొన్నారు. పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించే విషయంపై ఆయనతో కోర్ కమిటీ సభ్యులు మాట్లాడినట్లు చెబుతున్నారు. కోర్ కమిటీ సమావేశం దాదాపు 70 నిమిషాల పాటు సాగింది. శీతాకాలం సమావేశాల్లోనే బిల్లును ప్రతిపాదించాలనే ఉద్దేశంతోనే తాము ఉన్నట్లు కోర్ కమిటీ సమావేశానంతరం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పారు.
తెలంగాణపై భవిష్యత్తు కార్యాచరణ మీద కోర్ కమిటీ చర్చించి, ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. డిసెంబర్ 4వ తేదీన కేంద్ర మంత్రివర్గం ముందుకు జివోఎం నివేదిక, తెలంగాణ ముసాయిదా బిల్లు రానున్నాయి. డిసెంబర్ 3వ తేదీన మరోసారి జివోఎం సమావేశమవుతుంది.
తెలంగాణపై ఢిల్లీ రాజకీయాలు శుక్రవారంనాడు కూడా వేడిగానే సాగాయి. ఉదయం కేంద్ర మంత్రులు జైరాం రమేష్, సుశీల్ కుమార్ షిండే హోం శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. ఆ తర్వాత జైరాం రమేష్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. మరోవైపు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.

కాగా, ఇటు హైదరాబాదులో మరో పరిణామం చోటు చేసుకుంటోంది. డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. సెప్టెంబర్ 20వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం మళ్లీ సమావేశం కావడం ఇదే. రాష్ట్ర శానససభా సమావేశాల నిర్వహణపై రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
శాసనసభ శీతాకాలం సమావేశాలు ప్రారంభమైతే, తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయం చెప్పే ప్రక్రియను వాయిదా వేయవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. సాధారణ సమావేశాలు జరుగుతూ ఉంటే అవి ముందు బిఎసిలో ఖరారు చేసిన ఎజెండా ప్రకారమే నిర్వహించాల్సి ఉంటుందని అంటున్నారు. అప్పుడు తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి నుంచి గవర్నర్ చేతుల మీదుగా వచ్చినా వాయిదా వేయవచ్చునని అంటున్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు శాసనసభ ప్రత్యేక సమావేశాలకు గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి గవర్నర్‌ను కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. శాసనసభకు బిల్లు వస్తే దానిపై చర్చ జరపాల్సి ఉంటుందని అంటున్నారు. దీంతో రాష్ట్రపతి నుంచి బిల్లు రాకముందే శాసనసభా సమావేశాలను నిర్వహించి బిల్లుకు చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఎజెండా విస్తృతంగా ఉందని, తుఫాన్లు, వరదలు వంటి పలు విషయాలపై చర్చించాల్సి ఉందని, ఎజెండా ముగిసిన తర్వాత తెలంగాణ బిల్లుపై చర్చకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పే వీలుందని చెబుతున్నారు. ఈ లోపల పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ముగుస్తాయని, దాంతో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రక్రియలో జాప్యం చేయవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు.
శాసనసభా సమావేశాలు ప్రారంభం కాక ముందే బిల్లు వస్తే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ప్రశ్నోత్తరాలతో సహా మరే ఇతర ఎజెండాకు అవకాశం ఉండదని, కేవలం ముసాయిదా బిల్లుపైనే చర్చించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ వ్యూహానికి కాంగ్రెసు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications