హరీష్‌తో కేసీఆర్‌కే ముప్పు:జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యపై టీటీడీపీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేసిన హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యల పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు బుధవారం స్పందించారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
హీరో జూనియర్ ఎన్టీఆర్ వల్ల తమ పార్టీ యువనేత నారా లోకేష్‌కు ముప్పు ఉందని హరీష్ రావు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. హరీష్ రావు వల్లనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ముప్పు ఉందని వారు ధ్వజమెత్తారు.
అసెంబ్లీ సమయాన్ని అధికార పార్టీ వృధా చేస్తోందన్నారు. ఇలా చేయడం ఏమాత్రం సరికాదన్నారు. ప్రశ్నలు లేకుండే ప్రశ్నోత్తరాలు ఎందుకని వారు ప్రశ్నించారు. సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు అధికార పార్టీ సమాధానాలు చెప్పాలని వారు అన్నారు. అధికార పక్షం సభ్యులే పోడియం వద్దకు రావడం దివాళాకోరుతనమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సరైన ప్రతిపక్షం తామే అన్నారు. అందుకే తాము అంటే అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి భయమన్నారు. సభ్యుల పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఎప్పుడైనా ఇవ్వవచ్చునని వారు చెప్పారు. బడ్జెట్ పైన తమ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు తెరాస కుట్ర చేస్తోందన్నారు.
కాగా, హరీష్ రావు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్‌కు అడ్డువస్తాడని హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాలకు దూరం చేశాడని తీవ్ర విమర్శలు చేశారు.
నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగాలు చేసిన చరిత్ర తమది అన్నారు. కేసీఆర్‌కు ఆ చరిత్ర ఉందన్నారు. కానీ, చంద్రబాబు తనకు పదవి, పిల్లను ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచాడన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మృతికి చంద్రబాబు కారణమైన వ్యక్తి అన్నారు.
త్వరలో వరంగల్‌కు నిర్మల
త్వరలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వరంగల్ వస్తారని ఎంపీ వినోద్ కుమార్ వరంగల్ జిల్లాలో అన్నారు. పత్తి రైతులకు కనీస మద్దతు ధర రూ.5వేలు ఉండేలా ప్రయత్నిస్తానన్నారు. పత్తిసాగులో తెలంగాణ మూడోస్థానంలో ఉందన్నారు. పత్తి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు చూస్తామన్నారు.
తెలంగాణకు ప్రత్యేక బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయండి: హైకోర్టు
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది.












Click it and Unblock the Notifications