BJPతో పొత్తుపై పునరాలోచన?
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచేయడంతో ఆ ప్రభావం సామాన్యులపై పడింది. పొదుపు చేయడం కోసం దాచుకున్న సొమ్మును నిత్యావసరాల కోసం ఖర్చుచేయాల్సి వస్తోంది. సామాన్యుల ఆహార సరుకులపై కూడా జీఎస్టీ విధిస్తుండటంతో ఎటూ పాలుపోని పరిస్థితి. ఒక్క జీఎస్టీ ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి నెల ఆదాయం రూ.లక్ష కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్ల వరకు ఉంటుంది.
ఆంధ్రుల మనోభావాలతో ముడిపడివున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఎందరో ప్రాణత్యాగాలకు పాల్పడి సాధించిన ఉక్కు కర్మాగారం ఆ త్యాగాలకు విలువివ్వకుండా ప్రయివేటు పరం కాబోతోంది. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అరకొర నిధులే ఏపీకిస్తోంది. గడిచిన 30 సంవత్సరాల్లో నిత్యావసరాలపై ప్రజలు ఈస్థాయిలో ఎప్పుడూ ఖర్చుచేయలేదని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు అదానీ విదేశీ బొగ్గును బలవంతంగా కొనిపిస్తున్న పరిస్థితి.

ఇంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఏపీ ప్రజలు భారతీయ జనతాపార్టీ అంటేనే మండిపడుతున్నారు. అటువంటి పార్టీతో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకొని వెళితే నష్టపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంమీద ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అటువంటి సందర్భంలో పొత్తు అంటే టీడీపీకి మైనారిటీలు దూరమవుతారని అంచనా వేస్తున్నారు.
ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు నెరవేర్చని కమలం నేతలతో కలిసి వేదిక పంచుకుంటే నిర్ద్వంద్వంగా కూటమిని కూడా తిరస్కరిస్తారని, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయడంతోపాటు, ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత పొత్తుపెట్టుకున్న పార్టీలపై కూడా పడి నష్టపోతామని, పొత్తుపై పునరాలోచన చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications