మన ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవరైనా మిగిలారా హీరోలు కాకుండా??... అభిమానుల సంగతి తర్వాత...
మన ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవరైనా మిగిలారా హీరోలు కాకుండా.. అనే లెక్కలు వేసుకోవడమేకానీ అభిమానుల సంగతి, చిత్ర పరిశ్రమ సంగతిలాంటివేవీ వారికి పట్టదు. ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగి అభిమానులకు తమపై ఉన్న అభిమానాన్ని ''క్యాష్'' చేసుకునే ఉద్దేశమే ఉంటుందికానీ ఇతర విషయాలు పట్టవు. మనకు అన్నం పెట్టి ఈ స్థాయికి తీసుకొచ్చిన పరిశ్రమకు ఏం చేయాలి? కార్మికులను ఎలా ఆదుకోవాలి? మనం ఏం చేస్తే పరిశ్రమ బాగుపడుతుంది? ఇలాంటి ఆలోచనలు అసలు కలగవు. వారికి కావల్సింది.. కేవలం వారి స్వప్రయోజనాలు, వారి స్వార్థం. ప్రజల్లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన కథానాయకులు, దర్శకులపై ప్రస్తుతం ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇది.

ప్రేమను ''క్యాష్'' చేసుకోవాలనే ఆలోచనే సరికాదు..
అభిమానులైనా, ప్రేక్షకులైనా, ప్రజలైనా.. ఎవరైనా, పేరేదైనా అందరూ థియేటర్లకు వస్తారు.. సినిమా చూస్తారు.. ఆనందిస్తారు. అటువంటిది తమపై వారికున్న ప్రేమను ''క్యాష్'' చేసుకోవాలనుకునే ఆలోచనే సరికాదని, వ్యాపారాన్ని వ్యాపారంగానే చూడాలని.. నిస్వార్థంగా చూపించే ప్రేమకు వెల కట్టకూడదని, కానీ మేం ఇంత పెట్టుబడి పెట్టాం.. కాబట్టి ఎక్కువ ధరలు పెడుతున్నాం.. మీరు వారంరోజులు చూస్తే చాలు మేం గట్టెక్కుతామనే వారి దృక్పథాన్ని ఇప్పుడు అందరూ వ్యతిరేకిస్తున్నారంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

మూత పడుతున్న థియేటర్లు
ఈ తరహా ఆలోచనలతోనే సినిమా ఆదాయానికి ఆయువుపట్టు లాంటి థియేటర్లు మూతపడుతున్నా సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన లేదు. అవన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతూ వస్తుంటే రేపు తాము రోడ్డున పడాల్సి వస్తుందనే ఆలోచనే కలగడంలేదు. థియేటర్లే లేనప్పుడు ఏ ముఖ్యమంత్రినీ కలవాల్సిన అవసరం ఉండదు.. టికెట్ ధరలు పెంచాలంటూ కోరాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. కుటుంబం కుటుంబం థియేటర్ కు వచ్చి సినిమాలు చూసే రోజులు పోయాయని, ఇంట్లో అందరూ ఓటీటీలకు అలవాటుపడుతున్నారన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.

నిజజీవితంలోను తాము కథానాయకులమేనని నిరూపించుకోవాలి
సినీ పరిశ్రమ నాలుగు కాలాలపాటు మూడుపువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లాలి అంటే పునాది లాంటి థియేటర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమకు సంబంధించి 24 విభాగాల్లో చెమటోడుస్తున్న కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తాము తెరమీదే కథానాయకులంకాదు.. నిజ జీవితంలోను కథానాయకులమేనని, దర్శకులమేనని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే భవిష్యత్తులో సినిమాలన్నీ ఓటీటీల్లోనో, టీవీల్లోనో చూడాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications