తెలుగుకు తెగులు పట్టిస్తున్నారా ? ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో మాతృభాషకు అవమానం !
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో చోటుచేసుకున్న ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద చర్చకు దారి తీసింది. వందేళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నిర్వహించిన ఈ వేడుకల్లో అతిథులకు అందించిన స్నాక్ బాక్స్‌లపై తెలుగు పదాల్లో ఉన్న తప్పులు భాషాభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..
విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాలకు విద్యా, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినప్పటికీ, అతిథులకు ఇచ్చిన చిరుతిళ్ల పెట్టెలపై ముద్రించిన వాక్యాల్లోని తప్పులు కార్యక్రమ ప్రతిష్టను దెబ్బతీశాయి. సదరు స్నాక్ బాక్స్‌లపై 'వందేళ్ల వెలుగు.. తరాల ప్రగతికి అడుగు' అని ముద్రించాల్సి ఉండగా.. అది 'వండేళ్ళ వేలుగు.. త్రరాలు ప్రగతికి అడుగు'గా తప్పుగా ముద్రించబడింది.

అయితే సాధారణంగా గమనించదగిన ఈ తప్పులు పెద్ద సంఖ్యలో ముద్రించబడటం.. వాటిని ముందుగా పరిశీలించకుండానే అతిథులకు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చిరుతిళ్ల తయారీ, ప్యాకేజింగ్ బాధ్యతను విశాఖలోని ఒక ప్రైవేట్ హోటల్‌కు అప్పగించినట్లు సమాచారం. అంతే కాకుండా ముద్రణలో జరిగిన ఈ తప్పులను గుర్తించకుండా యూనివర్సిటీ అధికారులు యథాతథంగా పంపిణీ చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కార్యక్రమం వంటి ముఖ్యమైన సందర్భంలో కనీస పరిశీలన కూడా జరగకపోవడం పరిపాలనా లోపంగా భావిస్తున్నారు.
ఈ ఘటనపై భాషా నిపుణులు, తెలుగు ప్రేమికులు ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "తెలుగు భాషకు గౌరవం ఇవ్వాల్సిన విద్యాసంస్థలే ఇలా నిర్లక్ష్యం చూపడం బాధాకరం" అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికలపై భాషా ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ఉందని వారు సూచిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఫోటోలను షేర్ చేస్తూ, బాధ్యత వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు భవిష్యత్తులో ముద్రణ, కంటెంట్ పరిశీలనకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్యక్రమాల నిర్వహణలో నాణ్యతతో పాటు భాషా శుద్ధి కూడా సమానంగా ప్రాముఖ్యం పొందాలని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications