బంగాళాఖాతం మీదుగా: అప్పుడే 38 డిగ్రీలు.. మున్ముందు సినిమానే
Temperature in Andhra Pradesh: శివరాత్రి నాడు శివ శివా అంటూ చలి కైలాసానికి చేరుతుందని పెద్దలు చెబుతుంటారు. ఏపీలో మాత్రం దీనికి పూర్తి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. శివరాత్రి ఇంకా రానేలేదు. కనీసం దరిదాపుల్లోనూ లేదు. ఇప్పటి నుంచే ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ఉక్కపోతకు గురి చేస్తోంది.
చుక్కలు చూపిస్తోన్న పగటి ఉష్ణోగ్రత..
ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు పగటి ఉష్ణోగ్రత చుక్కలు చూపిస్తోంది. నడివేసవి నాటి వాతావరణాన్ని తలపిస్తోంది. ఫిబ్రవరి తొలి అర్ధభాగంలోనే రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదవుతోందంటే.. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

వచ్చే నాలుగు రోజుల్లో..
వచ్చే నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్- మే నెలల్లో పగటి ఉష్ణోగ్రత గరిష్ఠంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉండే అవకాశాలు లేకపోలేదు.
సగటు ఉష్ణోగ్రత కంటే అధికం..
ఈ నెల 4, 5 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో అత్యధికంగా 38.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ స్థాయిలో ఎండ తీవ్రత అక్కడ రికార్డు కావడం 20 సంవత్సరాల్లో ఇది ఏడోసారి. సగటు ఉష్ణోగ్రత కంటే నాలుగు డిగ్రీల మేర ఎండ తీవ్రత పెరిగినట్లు వాతావరణ కేంద్రం అభిప్రాయపడింది.
గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కంటే..
ఈ నెల 14వ తేదీన కోస్తా, రాయలసీమ జిల్లాల్లో దాదాపుగా 10కి పైగా వేర్వేరు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కావడం.. వచ్చే వేసవి తీవ్రత ఎలా ఉండబోతోందనే విషయాన్ని రుచి చూపించినట్టయింద. శుక్రవారం నాడు కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 37.4 డిగ్రల ఎండ కాసింది.
గాలిలో తేమశాతం..
కోస్తా జిల్లాల్లో గాలిలో తేమశాతం 45 నుంచి 70 శాతం వరకు ఉండగా.. ఈ సంఖ్య రాయలసీమలో 25 నుంచి 45 శాతంగా రికార్డయింది. పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. బంగాళాఖాతం మీదుగా వీస్తోన్న వేడి గాలుల వల్ల పొడి వాతావరణం నెలకొంటోంది.
పొగమంచు- వేడిగాలి
కొన్ని ప్రాంతాల్లో తెల్లవారు జామున పొగమంచుతో ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పటికీ- వేడిగాలుల ప్రభావం వల్ల మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అనూహ్యంగా పెరుగుతోందనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది వేసవి సీజన్‌లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రత రికార్డు కావొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications