అయ్యన్నపాత్రుడి ఇంటివద్ద ఉద్రిక్తత!!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మొహరించారు. నీటిపారుదలశాఖకు చెందిన స్థలం ఆక్రమించి ఇంటిని కట్టారంటూ నర్సీపట్నం పురపాలకశాఖ అధికారులు ఆయన ఇంటి గోడను అర్థరాత్రి సమయంలో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి ముందస్తు నోటీసులివ్వకుండా గోడను కూల్చివేశారంటూ అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంటి నిర్మాణమంతా సక్రమేనన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేశ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో తెలుగుదేశంపార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అయ్యన్నపాత్రుడికి మద్దతుగా ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. గోడను కూల్చివేయడానికి వచ్చిన జేసీబీ టైర్లలో ఆయన అనుచరులు గాలి తీసేశారు. ఇప్పటికే అక్కడ వందల సంఖ్యలో పోలీసులు ఉండగా, తాజాగా మరో మూడు బెటాలియన్లను పిలిపించి మొహరింపచేశారు.

పోలీసులు ఎంత సంఖ్యలో ఉన్నారో అంతకు రెట్టింపు సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తండోప తండాలుగా తరలివచ్చారు. అయ్యన్న ఇంటివద్ద టెంట్ వేసి పురపాలక శాఖ అధికారులు, పోలీసుల తీరుకు నిరసన తెలియజేస్తున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అయ్యన్న ఇంటివద్దకు వచ్చి కూల్చేసిన గోడను పరిశీలించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు అయ్యన్నపాత్రుడి ఇంటివద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు ఆయన నివాసానికి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు మూసేశారు. రాజేశ్ ను అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమంటూ అయ్యన్న అనుచరులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.












Click it and Unblock the Notifications