పులివెందులలో హై టెన్షన్: జగన్ టూర్ రీ షెడ్యూల్
వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక పోరులో అక్రమాలకు పాల్పడేందుకు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు అధికార యంత్రాంగం , కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బయటి ప్రాంతాల నుంచి వేలాది మందిని తరలించి దొంగ ఓట్లు వేయించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన రక్షణ కల్పించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలింగ్ బూత్ ఆక్రమణలు.. కార్యకర్తలపై అక్రమ కేసులు!
పులివెందులలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీకి చెందిన దాదాపు 900 మందికి పైగా కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. వందలాది మంది ఇళ్లకు వెళ్లి సోదాల పేరిట తీవ్రంగా భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. నిన్న జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారని, ఇదంతా ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని పేర్కొన్నారు. రేపటి పోలింగ్‌పై ప్రభావం చూపేందుకే ఇటువంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

పరాయి ప్రాంతాల నుంచి వేలాది మంది తరలింపు!
ఎన్నికల నిబంధనలను బొందపెట్టి ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మందిని పులివెందులకు తరలిస్తున్నారని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి వేలాది మంది కార్యకర్తలను, మహిళలను తెల్లవారుజామునే పోలింగ్ బూత్‌ల వద్ద మోహరించేలా ప్లాన్ చేశారన్నారు. "మీ ఓట్లు మేమే వేస్తాం, మీరు బూత్‌లకు రావద్దు" అని ప్రజలను బెదిరిస్తున్నారని, ఓటర్లు ఎవ్వరూ భయపడకుండా తమ ఓటు హక్కును తామే వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఓటర్ స్లిప్పుల పంపిణీలో కూడా తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని, వీటిని దొంగ ఓట్లకు వాడుకునే అవకాశం ఉందన్నారు.
జగన్ టూర్ రీషెడ్యూల్
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఆ రికార్డింగ్ ఫుటేజీని భద్రపరచాలని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ఏజెంట్లకు ఎలాంటి హాని జరగకుండా తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఏమైనా అక్రమాలు జరిగితే ఆధారాలతో సహా కోర్టు మెట్లు ఎక్కుతామని హెచ్చరించారు. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన రీషెడ్యూల్ అయిందని, ఆయన మధ్యాహ్నంలోపు పులివెందుల చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు.. ప్రమీలమ్మ వాహనం ధ్వంసం!
మరోవైపు పులివెందుల పట్టణంలోని పలు వార్డులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 38వ వార్డు పరిధిలోని సరస్వతి విద్యామందిర్ బూత్ వద్ద టీడీపీ శ్రేణులు హల్‌చల్ చేస్తూ రాళ్ల దాడికి దిగడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తిరగబడ్డాయి. బూత్ నెంబర్ 21 వద్ద పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై దాడి జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు. కొన్ని బూత్‌ల వద్ద కర్రలతో మూకలు బహిరంగంగా సంచరిస్తుండగా, బూత్ నంబర్ 17 వద్ద పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కడప ఉమెన్స్ కాలేజీ వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో మేయర్ అభ్యర్థి బండి దీప్తి పోలీసులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. మరోవైపు పులివెందులలో వైసీపీ ఎలక్షన్ ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తుంది













Click it and Unblock the Notifications
