సీఐడీ చేతికి మరో స్కామ్, వైసీపీతో లింక్ లు, ప్రభుత్వ ఉద్యోగులకు తడిచిపోయింది
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరిగిన డీడీఆర్ (ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవల్‌పమెంట్ రైట్) బాండ్ల కుంభకోణం తీగలాగితే డొంక కదలతోంది. స్థల సేకరణను ఎకరాల్లో గుర్తించి, బాండ్ల జారీకి చదరపు గజాల్లో లెక్కించినట్టు గుర్తించారు. అగ్రికల్చర్, రెసిడెన్షియల్ పరిధిలోని స్థలాలను కూడా కమర్షియల్‌గా గుర్తించి, రిజిస్ట్రేషన్ విలువ పెంచేసి భారీగా లబ్ధి పొందారని అంచనాకు వచ్చినట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై భారీఎత్తున కుంభకోణం జరిగినట్టు వెలుగులోకి వచ్చిన మునిసిపాలిటీలపై చంద్రబాబు ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నేతలతో అంటకాగిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇటీవల ప్రజాదర్బార్‌లో మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు.

తరువాత మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణకు లేఖ రాయడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. రెవెన్యూ మేనేజర్‌గా ఉన్న వీఎస్ చిట్టిబాబు, ఆర్వో కేఎల్ వర్మపై విజిలెన్స్ విచారణ చేపట్టి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు యువత నాయకుడు ఫిర్యాదులో మనవి చేశారు.
కుప్పం మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో చిట్టిబాబు వైసీపీ నాయకులకు కొమ్ముకాశారని, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టడంతో పాటు, కుప్పం మునిసిపల్ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేశారని టీడీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుపతి వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి ఓట్లు వేయాలని మునిసిపల్ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక ఆర్వో కేఎల్ వర్మ గతంలో పుంగనూరు మున్సిపల్ కమిషనర్‌గా పని చేశాడని, ఆ సమయంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారని పేర్కొన్నారు. అదేవిధంగా కుప్పం స్థానిక ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా వెళ్లి అక్కడ కూడా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పినట్టు చేశారని తెలుగు యువత నాయకుడు రవి నాయుడు ఆరోపించారు.
ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్ ఆర్వోగానూ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మరో ఫిర్యాదు లేఖలో టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, డీఈ విజయకుమార్ రెడ్డి పేర్లను ప్రస్తావించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల ఏర్పాటు, టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో బాలసుబ్రమణ్యం పాత్ర ఉందని, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి, మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.

తిరుపతి మున్సిపల్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం అభినందనీయమని టీడీపీ నాయకులు అంటున్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారులు పాలకులకు తొత్తులుగా మారిపోయి ప్రజాధనాన్ని లూటీ చేస్తే తగిన పరిణామాలకు సిద్ధపడాల్సి ఉంటుందని అంటున్నారు. మంత్రి నారా లోకేశ్‌కు ప్రజాదర్భార్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి మంత్రి నారాయణకు లేఖ రాయడం, ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో అవినీతి అధికారులు బిత్తరపోతున్నారు.












Click it and Unblock the Notifications