నోటుకు ఓటు: చంద్రబాబుకు దన్నుగా కీలక మంత్రులు వీరే..
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు వల్ల చిక్కులను ఎదుర్కుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడికి ఐదారుగురు మంత్రులు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. మంగళవారంనాడు తనకు అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు.
చర్చల తర్వాత కొంత మంది ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ మంత్రుల్లో సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్ కుమార్ ముఖ్యులు.

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం వ్యూహరచన చేసి, దాన్ని ముందుకు తెస్తున్నవారు కూడా వారేనని అంటున్నారు. అవసరమైతే హైదరాబాదులో పోలీసు స్టేషన్లను పెడుతామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో నోటుకు ఓటు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము రెండు అడుగులు వేస్తామని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ పూర్తిగా ఇరుక్కుపోయారని, చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తాము కెసిఆర్‌కు నోటీసులు ఇప్పిస్తామని కూడా హెచ్చరికలు చేశారు. కెసిఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి పనికి వచ్చే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా వారు హెచ్చరించారు.
అంతకు ముందు, కెసిఆర్ ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినవారిలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, గంటా శ్రీనివాస రావు, తదితరులు ఉన్నారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు.












Click it and Unblock the Notifications