మార్మోగిన తిరుపతి
Tirupati: టెంపుల్ సిటీ తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి విరిసింది. దీపకాంతులతో వెలిగిపోయింది. పౌర్ణమిని పురస్కరించుకుని కపిలతీర్థం సహా అన్ని ఆలయాల్లోనూ కార్తీక దీపాలను వెలిగించారు. కృతిక దీపోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.
కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతి- అలిపిరి మార్గంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సాయంత్రం కృత్తికా దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణ చేశారు. హర హర మహాదేవ శంభో శంకర అనే మంత్రోచ్ఛారణల మధ్య కార్తీక దీపోత్సవం అత్యంత భక్తి పారవశ్యంతో జరిగింది.

ఆలయ ప్రాంగణంలో మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి కపిలేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీకామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు.
ఈ సందర్భంగా ఊంజల్ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. ఆ తరువాత జ్వోలాతోరణం వెలిగించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ గౌతమి, సదా లక్ష్మి, డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
కార్తీక మాసం సందర్భంగా ఏటా వేల సంఖ్యలో భక్తులు తిరుపతి కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ కార్తీకమాసంలో కపిలేశ్వరుడిని దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా భక్తుల సంఖ్య భారీగా తరలివచ్చారు. కార్తీకమాసం పొడవునా కపిలేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు టీటీడీ అధికారులు.
తెల్లవారు జామున 5కు ప్రత్యేక అభిషేకాలు, మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. చండికేశ్వరస్వామికి అభిషేకం, త్రిశూల స్నానం, లక్షదీపారాధన, పంచమూర్తులైన విఘ్నేశ్వరస్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహించారు.












Click it and Unblock the Notifications