జగన్ Vs పవన్ కల్యాణ్: ‘బ్రో’ కోసం ముందుకు రాని థియేటర్లు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన చిత్రం 'బ్రో'. సముద్ర ఖని దర్శకత్వం వహించారు. ఈనెల 28వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తోపాటు మైడియర్ మార్కండేయ సింగిల్ చిత్రంపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ భారీధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రావడంలేదని తెలుస్తోంది.
దాదాపుగా అన్ని ప్రాంతాల్లో 'బ్రో' బిజినెస్ ముగిసింది. నైజాం రూ. 30 కోట్లు (GST సహా), ఆంధ్ర (6 ఏరియాస్, GST సహా) 40 కోట్ల రూపాయల నిష్పత్తిలో విక్రయించారు. సీడెడ్ ప్రాంతానికి సంబంధించిన హక్కులు రూ. 13.5 కోట్లకు అమ్ముడయ్యాయి. వాస్తవానికి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ అతిథి పాత్ర వేస్తున్నారు. అయినా సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ మాత్రం బాగా జరిగినట్లే లెక్క. ఈ సినిమా కలెక్షన్లకు తెలంగాణలో ఎటువంటి ఢోకా లేదు. కాకపోతే ఏపీలో పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి.

జనసేన పార్టీ ద్వారా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ యుద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ చేతుల్లోనుంచి ఏపీని కాపాడటమే తన ధ్యేయమని ప్రకటిస్తున్నారు. పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఏపీలో టిక్కెట్ ధర సింగిల్ స్క్రీన్స్‌లో 145/- మల్టీప్లెక్స్‌లో రూ. 177/- గా ఉంది. అవి కూడా A సెంటర్స్‌లో మాత్రమే. నైజాంలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175/- మల్టీప్లెక్స్‌లలో రూ. 295/-గా ఉంది. ఈ ధరలవల్ల తెలంగాణలో రికవరీ సాధ్యపడుతుంది. కానీ ఏపీలో రికవరీ మాత్రం ఈ ధరలకు సాధ్యపడదు. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న పవన్ కల్యాణ్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించదని ఎగ్జిబిటర్లకు అర్థమైంది. దీంతో వారు ఇప్పుడున్న ధరల ప్రకారం బ్రో సినిమాను ప్రదర్శించేందుకు ముందుకు రావడంలేదు. నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications