జగన్ ప్రభుత్వంలో నకిలీ హోలో గ్రామ్ తో లిక్కర్ వ్యాపారం ?, విజిలెన్స్ దెబ్బతో !
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విక్రయాల్లో భారీ గోల్ మాల్ కు పాల్పడిందని, కొందరు వైసీపీ నాయకులు వేల కోట్ల రూపాయలు మింగేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఇప్పుడు మద్యం విక్రయాలకు సంబంధించి మరో స్కామ్ బయటకు వచ్చింది. ప్రభుత్వ షాపుల్లో మద్యం విక్రయాలకు ఉపయోగించే హోలో గ్రామ్ స్టిక్కర్లు కూడా నకిలీ అని విజిలెన్స్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అదికారులు అనుమానం వ్యక్తం చెయ్యడం కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఎంత మద్యం కొనుగోలు చేశారు ? ఎంత మద్యం విక్రయించారు ? అనే విషయం లెక్కలు తేలడం లేదని సీఐడీ అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ డిపోల నుంచి కాకుండా నేరుగా మద్యం తయారీ కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేసి తరువాత నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లు అతికించి మద్యం విక్రయించారని సీఐడీ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని తెలిసింది.

ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే ఆయా కంపెనీలకు హోలో గ్రామ్ స్టిక్కర్లు తయారు చేసే టెండర్లు ఇచ్చారని, హోలో గ్రామ్ టెండర్లకు సంబంధించిన కీలక సమాచారం మొత్తం గల్లంతు అయ్యిందని, టెండర్ల ఖరారు ప్రక్రియ సాంకేతిక కమిటీ నివేదికపై సంతకాలు కూడా లేవని, సాంకేతిక కమిటీని సమావేశాల మినిట్స్ మాయం అయ్యాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మద్యం విక్రయాలలో సుమారు రూ. 18 వేల కోట్లకు పైగా గోల్ మాల్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న సమయంలో ఇప్పుడు విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ విషయాలు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. మద్యం బాటిల్స్ పై అతికించడానికి హోలో గ్రామ్ తయారు చేసి ఇచ్చిన కంపెనీలు ఏవి అని విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.
గతంలో ఏఏ కంపెనీలకు ఆ సంస్థలు హోలో గ్రామ్ తయారు చేసి ఇచ్చారు ?, ఆ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ? అని విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో నాసిరకం మద్యం విక్రయించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి వైసీపీ ప్రభుత్వం అదే మద్యం విక్రయాలు అడ్డం పెట్టుకుని మరో స్కామ్ చేసిందని విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications