సీఎం సొంత జిల్లాలో ‘‘లిక్కర్’’ లిటికేషన్, పోటీకి దూరంగా వైసీపీ
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం ఏర్పాటు కానున్న నేపథ్యంలో లిక్కరి షాపుల లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న మద్యం వ్యాపారులను కొన్ని రాజకీయ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ షాపుల లైసెన్స్ లు మంజూరు చేస్తే సుమారు రెండు వేల కోట్ల రూపాయాల ఆదాయం వస్తుందని అంచనా వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయ్యింది.
సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం పలువురు దరఖాస్తులు చేసుకోవడంతో కేవలం రూ. 24.48 కోట్ల ఆదాయం వచ్చింది. లిక్కర్ షాప్ లైసెన్సుల కోసం చిత్తూరు జిల్లాలో చాలా తక్కువగా దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో 104 ప్రైవేట్ మద్యం దుకాణాలకు లైసెన్స్ లు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.

ఇప్పటివరకు సుమారు 1,298 దరఖాస్తులు మాత్రమే చిత్తూరు జిల్లాలో వచ్చాయి. దరఖాస్తుల గడువు పూర్తి కావస్తున్న నేపథ్యంలో లిక్కర్ షాప్ లైసెన్సుల కోసం దరఖాస్తులు సమర్పించే వారి సంఖ్య చాలా తక్కువకు పడిపోయింది. కొన్ని చోట్ల అయితే లిక్కర్ షాపు లైసెన్స్ కోసం ఒకరు, ఇద్దరు మాత్రమే దరఖాస్తులు సమర్పించారని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎక్కువ పలుకుబడి కలిగిన వారే ఉండటంతో వారిని ఎదిరించి లిక్కర్ షాప్ లైసెన్స్ దక్కించుకున్నా ఆ తర్వాత వ్యాపారం చేయడం చాలా కష్టమని మద్యం వ్యాపారులు భయపడిపోతున్నారని సమాచారం.
చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఒకరిద్దరు మాత్రమే లిక్కర్ షాప్ లైసెన్స్ ల కోసం దరఖాస్తులు సమర్పించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటివరకు సింగల్ దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. వైసీపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరు సదుంలో ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చిందని అధికారులు అంటున్నారు. నగిరి పెద్దపంజాణి, నిండ్ర, పుంగనూరు ప్రాంతాల్లో ఒక లిక్కర్ షాప్ కు రెండు మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అధికారులు అంటున్నారు.

అయితే అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారం చెయ్యాలని ప్రయత్నిస్తున్న వారిని పిలిపించి రాజీ చేయించారని, అందుకే చిత్తూరు జిల్లాలో లిక్కర్ షాప్ లైసెన్సుల కోసం పోటీ పడడం లేదని తెలిసింది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఇప్పటివరకు కనీసం రెండు వేల దరఖాస్తులు కూడా రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా నగిరి, పుంగనూరులో అధికార పార్టీకి చెందిన నాయకులు లిక్కర్ షాప్ లైసెన్సుల కోసం ఎవ్వరూ దరఖాస్తు చేసుకోకూడదని చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై తాము ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, త్వరలో ఇంకా ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో లిక్కర్ షాప్ ల లైసెన్సుల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. చిత్తూరు జిల్లాలో 104 లిక్కర్ షాప్ ల లైసెన్సులు ఇవ్వడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.












Click it and Unblock the Notifications