జగన్ గుర్తించిన 19 మంది ఎమ్మెల్యేలు వీరేనా ? జాబితాలో సీనియర్లు, మంత్రులు...!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జనంలోకి వెళ్లేలా స్కెచ్ రూపొందించారు. ఇందుకు అనుగుణంగా వారిని జనంలోనే ఉండేలా ఆదేశాలు కూడా ఇచ్చారు. అలాగే వీరు జనంలో తిరుగుతున్నారా లేదా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఇలా తాజా సర్వేలో పనితీరు బాగోలేని 19 మంది ఎమ్మెల్యేలను గుర్తించారు. వీరి జాబితా ఇలా ఉంది.
జగన్ గుర్తించిన పనితీరు బాగోలేని 19 మంది ఎమ్మెల్యేల్లో పలువురు సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు, జగన్ కు సన్నిహితులైన వారు కూడా ఉన్నారు. వీరిలో ముందుగా రాయలసీమ జాబితా పరిశీలిస్తే ఇందులో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో చూసుకుంటే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబుమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఉత్తరాంధ్ర విషయానికొస్తే భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినఅప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు. వీరందరి పేర్లను నిన్న జగన్ బయటపెట్టలేదు. కానీ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ పేర్లను నిర్ధారిస్తున్నారు. మరోవైపు వీరిని త్వరలో స్వయంగా పిలిపించి మాట్లాడాలని జగన్ నిర్ణయించారు. అప్పటికీ పనితీరు మార్చుకోకపోతే టికెట్లు నిరాకరించేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications