శ్రీశైలం దేవస్థానంలో ఈ ఐదు రోజులు ఉగాది మహోత్సవాలు..
ఏపీలోని పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధిచెందినది శ్రీశైలం దేవస్థానం. ఈ ఆలయంలో ఉగాది మహోత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ ఆరో తేది నుంచి పదో తేది వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర పాదయాత్ర భక్తబృందాలతో ఆలయ ఈవో పెద్దిరాజు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు జరగబోయే ఈ ఉగాది మహోత్సవాల సమయంలో భక్తులందరికీ కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉండనున్నట్లు తెలిపారు.
భక్తుల సందర్శనార్థం నేటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు రోజుకు నాలుగు విడతలుగా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అయితే స్వామివారి స్పర్శదర్శనం కోసం వెళ్లే భక్తులకు రూ.500 టిక్కెట్టును ఒక్కొక్క విడతలో 1500 టిక్కెట్లు ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రపరిధిలోని ఆలయంలోని ప్రదేశాలలో చలువపందిర్లు, మంచినీటి సౌకర్యం, శౌచాలయాలు, విద్యుత్ దీపాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 10వరకు స్వచ్ఛందసేవకుల సేవలు..
ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు ఆలయంలో జరగబోయే ఉగాది మహోత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. శ్రీశైల మల్లిఖార్జున స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు కోసం అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు. నిరంతరం మంచినీటి సదుపాయం, అల్పాహారం అందజేయనున్నట్లు తెలిపారు. ఇక, ఉగాది ఉత్సవాల సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛందసేవకుల సేవలను దేవస్థానం వినియోగించుకుంటుందని ఈ సందర్భంగా ఆలయ అధికారులు తెలిపారు. లాటరీ పద్ధతిలో స్వచ్ఛంద సేవా బృందాలకు ఆలయం, క్షేత్రపరిధిలోని ప్రదేశాలలో కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ స్వచ్ఛంద సేవకులు మార్చి 29 నుంచి ఏప్రిల్ పదో తేది వరకు ఈ సేవలను అందించాలన్నారు. స్వామివారి ఆలయం, ముఖ మండపం, నంది మండపం, ధ్వజస్తంభం, అమ్మవారి ఆలయం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం, ఉచిత క్యూ లైన్, భక్తులు దర్శనానికి వేచి ఉండే క్యూ కాంప్లెక్స్, పుష్కరిణి, గంగా భవానీ స్నాన ఘట్టాలు, పాతాళ గంగ, హఠకేశ్వరం, సాక్షి గణపతి, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, అన్నదానం, వైద్యశాల, వంటి తదితర ప్రాంతాల్లో సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications