ఇవే నా చివరి ఎన్నికలు... గెలిపించండి!!
సర్వేపల్లిలో అంతకంతకు టీడీపీ బలం పెరుగుతోందని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అధినేత చంద్రబాబుకు నమ్మినబంటుగా ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోతున్నారా? లేదా? అనే మీమాంస పార్టీతోపాటు ప్రజల్లో కూడా ఉంది. వరుసగా మూడుసార్లు ఓటమిపాలైనవారికి టికెట్లు ఇచ్చేది లేదని ఒంగోలు మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందువరుసలో ఉంటారు.

పలకరించిన వరుస పరాజయాలు
1994, 1999 ఎన్నికల్లో వరుసగా సర్వేపల్లి నుంచి విజయం సాధించిన సోమిరెడ్డికి ఆ తర్వాత అదృష్టదేవత ముఖం చాటేసింది. 2004 నుంచి ఆయన్ను వరుస ఓటములు పలకరిస్తూనే ఉన్నాయి. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2012లో కోవూరుకు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014, 2019 వరుస ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓటమి చవిచూశారు.

పార్టీ బలపడిందని అంచనా..
ఇలా వరుసగా 5సార్లు ఓటమి పాలైన సోమిరెడ్డి 2024 ఎన్నికల బరిలోకి దిగుతారా? అనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతోంది. పార్టీ పెట్టుకున్న సిద్ధాంతం ప్రకారం సర్వేపల్లి సీటు సోమిరెడ్డికి ఇవ్వకూడదు. కానీ సోమిరెడ్డి ఇక్కడ యథావిధిగా తన పని తాను చేసుకుంటున్నారు.
నియోజకవర్గంలో సరైన అభివృద్ధి లేకపోవడం, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో పరిస్థితి మారిందని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో సోమిరెడ్డి బలం పెరిగిందని చెబుతున్నారు.

పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి!
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి వెంకటగిరికి వలస వెళుతున్నారని, అక్కడి నుంచి పోటీచేయడానికి సిద్ధపడుతున్నారని చెబుతున్నారు. కానీ కాకాణి సర్వేపల్లిలోనే బరిలోకి దిగే అవకాశం కనపడుతోంది. గత ఎన్నికలంటే కాస్తంత కష్టపడాల్సి వస్తుంది అంటున్నారు. మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇవే తనకు చివరి ఎన్నికలు అనే సెంటిమెంట్ తో బరిలోకి దిగడం ఖాయమైంది.
అయితే పార్టీ పెట్టుకున్న సిద్ధాంతాన్ని సోమిరెడ్డి విషయంలో అమలు చేస్తారా? చేయరా? అనేది తెలుసుకోవడానికి సర్వేపల్లి సీటు ఎవరికో ప్రకటించేవరకు ఉత్కంఠ తప్పేలా లేదు. చివరి ఎన్నికలని చెబుతున్న సోమిరెడ్డి ఈ సెంటిమెంట్ తో కచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలుస్తానని అధిష్టానానికి చెబుతున్నారు. చంద్రబాబునాయుడు మొహమాటం కొద్దీ సీటు కేటాయిస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications