పులివెందులలో ఏం జరుగుతోంది?- అడుగడుగునా
కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు ఎన్నికల సిబ్బంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు. బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ జరుగుతోంది.
పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తోన్నారు.

ఎన్నికల ప్రచార సమయంలో దాడులు చేసుకున్న ఘటనలు నమోదైనందున.. అవి పునరావృతం కాకుండా ఉండటానికి ముందస్తు చర్యలు తీసుకున్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో 500 మంది బైండోవర్ కేసులు నమోదయ్యాయి. పలువురిని హౌస్ అరెస్ట్ లో ఉంచినట్లు సమాచారం.
ఈ రెండు చోట్లా 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి, టీడీపీ తరఫున పోటీ చేసిన మారెడ్డి లతారెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. వీరిద్దరూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ రెండు పార్టీల తరఫున మంత్రులు, మాజీ మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పులివెందులలో వైఎస్సార్సీపీకి చెందిన కడప లోక్ సభ సభ్యుడు అవినాష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కడపకు తరలించినట్లు సమాచారం. అరెస్ట్ ను నిరసిస్తూ అవినాష్ రెడ్డి కొద్దిసేపు ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు ఇంటిివద్దకు చేరుకున్నారు. దీంతో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే- వేంపల్లెలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పులివెందులలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు రాంగోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు రావడంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయారని, లోపలి వైపు గడియ వేసుకుని ఇంట్లో ఉన్నారని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల మధ్య హేమంత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలను ఎవ్వరినీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటోన్నారని ఆరోపించారు. తన ఇంటి చుట్టూ 100 నుంచి 150 మంది బయటి వ్యక్తులు మోహరించి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వెళ్లనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారని, భయభ్రాంతులకు గురి చేస్తోన్నారని విమర్శించారు. పలుచోట్ల బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications