ఏపీ ఎన్నికల్లో 130కి పైగా సీట్లతో ఆ పార్టీదే అధికారం: లేటెస్ట్ జాతీయ సర్వే రిపోర్ట్
Times Now survey: ఏపీలో క్రమంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంటోంది. ఇంకో రెండు నెలల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చర్యలు తీసుకుంటోన్నారు. ఎన్నికల ప్రచార శంఖారావాన్నీ పూరించారాయన. సిద్ధం పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తోన్నారు.
అటు తెలుగుదేశం పార్టీ కూడా జనంలోకి వెళ్తోంది. రా.. కదలిరా పేరుతో రాష్ట్రవ్యాప్త సభలకు శ్రీకారం చుట్టారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ సభలను నిర్వహించారు. జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో- సీట్ల పంపకాల వ్యవహారంలో కొంత జాప్యం ఏర్పడుతోంది.

ఈ పరిస్థితుల్లో- ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన సర్వే నివేదికను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సర్వే రిపోర్ట్.. వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..? అనే అంశం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది టైమ్స్ నౌ. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఈ ఒపీనియన్ పోల్స్‌ను నిర్వహించింది. సామాజిక వర్గాల, వయస్సు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వయోధిక వృద్ధులు.. ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుంచి ఒపీనియన్‌ను తీసుకుంది.
దీని ప్రకారం చూస్తే- 19 లోక్‌సభ స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 47.6 శాతం ఓట్లతో ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. 2019 ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అంటూ ఏదీ లేదనే విషయాన్ని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది.

ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన కూటమికి దక్కే లోక్‌సభ స్థానాలు.. 6. ఈ రెండింటికీ కలిపి 44.4 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. బీజేపీకి దక్కే ఓట్ల శాతం.. 2.1గా తేలింది. కాంగ్రెస్‌కు అంతకంటే తక్కువగా అంటే 1.5 శాతం మాత్రమే ఓట్లు పడొచ్చని టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది.
లోక్‌సభ సీట్లల్లో సాధించే విజయాన్ని అసెంబ్లీకి అన్వయించుకుంటే.. ఇక్కడా వైసీపీకి ఎదురు ఉండదు. ఇక్కడా క్లీన్ స్వీప్ నమోదవుతుంది. ఒక్కో లోక్‌సభ పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలను లెక్కలోకి తీసుకుంటే వైసీపీకి 133 సీట్లు లభిస్తాయి. ఈ స్థాయి భారీ మెజారిటీతో మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని అందుకుంటుంది వైసీపీ.












Click it and Unblock the Notifications