కార్తీక మాసం శ్రవణా నక్షత్ర వేళ, 9 టన్నుల పుష్పాలతో- తిరుమలలో కన్నుల పండువగా..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తిరుమలకు భక్త జనం పోటెత్తారు. గోవింద నామ స్మరణలతో తిరుమల వీధులన్నీ మారుమోగిపోతున్నాయి. అలిపిరి టోల్ గేట్ నుంచి భక్తుల రద్దీ మొదలయింది. నేడు శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం కల్యాణోత్సవ మండపంలో పుష్పయాగాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. కన్నుల పండువగా ఈ ఉత్సవం కొనసాగుతోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు తిరుమలలో ఘనంగా జరిగింది. శ్రీవారి పుష్ప యాగానికి ఎనిమిది టన్నుల పుష్పాలను వినియోగిస్తున్నారు.ఎనిమిది టన్నుల పుష్పాలతో శ్రీవారికి పుష్పార్చన నిర్వహించనున్న అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. పుష్ప యాగం సందర్బంగా శ్రీవారి ఆలయంలో జరిగే పలు అర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవ స్థానం అధికారులు రద్దు చేశారు. పుష్పయాగాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమల కు తరలి వచ్చేందుకు బారులు తీరారు. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ .. టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తో సహా అధికారులు.. శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.

వైభవంగా పుష్పయాగం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి టీటీడీ పునరుద్ధరించి నిర్వహిస్తున్నదని వివరించారు. శ్రీవారి పుష్పయాగానికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు.













Click it and Unblock the Notifications
