తిరుమలలో ముదురుతున్న కర్ణాటక సత్రాల వివాదం - అంగీకరించేది లేదు..!!
తిరుమల బ్రహ్మోత్సవాలకు ముస్తాబు అయింది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. కాగా, తిరుమలలో కర్ణాటక సత్రాల వివాదం ముదరుతోంది. వీటి నిర్వహణ ఆ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్పొరేషన్(కేఎస్‌టీడీసీ) తీసుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. దీని పైన టీటీడీ సభ్యులు... పలువురు ముఖ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఉండే అన్నింటి పైనా టీటీడీ కే బాధ్యతలు ఉంటాయని తేల్చి చెబుతున్నారు.
తిరుమలలో కర్ణాటక ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదంగా మారుతోంది. తిరుమల కొండ పైన కర్ణాటక సత్రాల నిర్వహణ బాధ్యతలను ఆ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్పొరే షన్(కేఎస్‌టీడీసీ) తీసుకోవడం ఈ వివాదానికి కారణంగా మారింది. ఇప్పటివరకు ఏపీ దేవదాయ శాఖ పరిధిలో ఉన్న కర్ణాటక ప్రవాస సౌధ భవనాలను ఇకపై కేఎస్‌టీడీసీ నిర్వహిస్తుందని ఇటీవల ఆ శాఖ ఎండీ శివప్రసాద్ తిరుమలలో ప్రకటించారు. తిరుమలలోని వివిధ మఠాలతో పాటు కర్ణాటక సత్రాల నుంచి కూడా రోజూ శ్రీవారికి సమర్పిస్తున్న నిత్య హారతుల్లో తమ రాష్ట్ర అధికారులను, ప్రజాప్రతినిధులను పంపుతామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రకటనపై గతంలో తీవ్రస్థాయి దుమారం రేగింది. తాజాగా ఆలయం వెనుకభాగంలో సుమారు ఏడున్నర ఎకరాల స్థలంలో ఉన్న కర్ణాటక సత్రాలను దేవదాయ శాఖ నుంచి కర్ణాటక టూరిజం శాఖ తీసుకోవడం వివాదంగా మారింది. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే కానీ టూరిజం కేంద్రం కాదంటూ పలువురు స్పందిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

కర్ణాటక నిర్ణయం తో వివాదం
కాగా.. ఈ వివాదం పైన టీటీడీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి స్పందించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆటలను సాగనివ్వబోమని తెలిపారు. మైసూర్ మహారాజు గౌరవార్థం టీటీడీ ఇచ్చిన ఏడున్నర ఎకరాల స్థలంలో కర్ణాటక ప్రభుత్వం యాత్రికుల కోసం గదులు నిర్మించిందని.. అయితే, ఆ భవనాలను టూరిజం శాఖకు అప్పగించడం మంచిది కాదని పేర్కొన్నారు. సీఎం డీకే శివకుమార్ జోక్యంతో తిరుపతికి చెందిన, కేంద్రమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు చక్రం తిప్పుతున్నారని వ్యా్యానించారు. కర్ణాటక సత్రాల్లోని షాపులను, హోటళ్లను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తు న్నారని... ఇలానే ముందుకెళ్లాలని ప్రయత్నిస్తే మొత్తం ఆస్తిని టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పుకొచ్చారు. కొందరికి మేలు చేయాలని శివకుమార్ తన అధికారాన్ని ఇటువంటి పనులకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. అదే విధంగా తిరుమలలోని ప్రతి అంగుళం భూమి శ్రీవారి ఆస్తేనని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. అలాంటి తిరుమలలో కర్ణాటక సత్రాలను పర్యాటక శాఖకు ఇవ్వాలని నిర్ణయించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసారు.













Click it and Unblock the Notifications
