తిరుమలలో వాటి కోసం ఎక్స్ క్లూజివ్ కౌంటర్లు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 68,542 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 22,372 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.98 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.
తిరుమలలో కొత్త కౌంటర్లు ఏర్పాటయ్యాయి. లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాద రక్షల నిర్వహణ కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద ఈ కౌంటర్.. భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తిరుమల కొండపై భక్తులు ఎదుర్కొంటున్న పాద రక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాద రక్షల నిర్వహణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం అద్భుత ఫలితాలు ఇవ్వడంతో, తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ విధానంలో భక్తులు తమ పాద రక్షలను కౌంటర్ వద్ద అప్పగించగానే వారికి QR కోడ్‌తో కూడిన స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్‌లో పాద రక్షల సంఖ్య, సైజు, ర్యాక్ నంబర్, బాక్స్ నంబర్, నిల్వ చేసిన స్థానం వంటి పూర్తి వివరాలు ఉంటాయి. భక్తులు తిరిగి వచ్చి ఆ స్లిప్‌ను స్కాన్ చేయగానే పాద రక్షలు ఉన్న ఖచ్చితమైన స్థానం డిస్‌ప్లే అవుతుంది. ఫలితంగా అతి తక్కువ సమయంలోనే భక్తులకు పాద రక్షలు తిరిగి తీసుకోవచ్చని అదనపు ఈవో తెలిపారు.
ఈ వ్యవస్థ అమలుతో ఇప్పుడు దాదాపు 99 శాతం భక్తులు తమ పాద రక్షలను తిరిగి పొందుతున్నారని, గతంలో గుట్టలుగా పడిపోవడం వల్ల సుమారు 70-80 శాతం మంది భక్తులు పాద రక్షలు వదిలేసి వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తొలగిపోయిందని వెంకయ్య చౌదరి అన్నారు. ఈ వినూత్న ప్రాజెక్టును కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీఎస్ఆర్లో భాగంగా అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications