తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ద్వారా దర్శన టికెట్లు...
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కూడా స్వామి వారి దర్శనానికి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ రోజు 1వెయ్యి టికెట్లను ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అందుబాటులో ఉంచనున్నారు. ఆన్‌లైన్‌లో బస్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా మరో రూ.300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్లు పొందవచ్చు. ప్రతీ రోజు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గం. వరకు ఈ టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు.టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
మరోవైపు తిరుమలలో శుక్రవారం(జులై 17) సాయంత్రం భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరస్కరించడంతో భక్తులు ఆగ్రహించారు.తమకు ఏదో ఒక దర్శనం కేటాయించాలని కోరినప్పటికీ అధికారులు నిరాకరించడంతో... టీటీడీ ఈవో కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. భక్తుల ఆందోళనతో తిరుమల కొండపై భద్రతను కట్టుదిట్టం చేశారు. గత వారం రోజుల్లో భక్తులు ఇలా ఆందోళనకు దిగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

సాధారణంగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో వచ్చేవారు... వాటిని ఉదయం 10గం. నుంచి మధ్యాహ్నం ఒంటిగంట సమయం లోగా అదనపు ఈవో కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. కార్యాలయ అధికారులు వాటిని పరిశీలించి మొబైల్‌కు మెసేజ్ పంపిస్తారు.అయితే ఇటీవల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఎక్కువైపోవడంతో అధికారులు వాటన్నింటిని పరిశీలించడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు,వీఐపీ దర్శనాలు మాత్రమే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఏప్రిల్ 14 నుంచి సర్వదర్శనం టోకెన్లను పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 5వేలకు కుదించింది. ప్రస్తుతం నిత్యం 18వేల వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు అంచనా. టికెట్లు,హుండీ ద్వారా కలిపి రోజుకు రూ.2కోట్లు ఆదాయం వస్తున్నట్లు చెబుతున్నారు.
Recommended Video
సాధారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో 60శాతం మేర ఉచిత దర్శనం చేసుకునేవారే ఉంటారు. కరోనా కారణంగా కేవలం టికెట్లు కొనేవారికే దర్శన అవకాశం కల్పిస్తుండటంతో సామాన్య భక్తులు ఆవేదన చెందుతున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పట్లో ఉచిత దర్శనాలు ఉండే అవకాశం కనిపించట్లేదు. దీంతో శ్రీవారి దర్శన భాగ్యం కోసం సామాన్యులు ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications