3 నెలల్లో ఏపీ సర్కార్ పతనం-భూమన కామెంట్స్-లడ్డూ వివాదం వేళ తిరుపతి ఎన్నికలు..!
ఏపీలో తాజాగా సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చిన లడ్డూ వివాదం రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అంతే కాదు ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నానాటికీ పతనం అవుతున్న వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎన్నికలు వచ్చి పడ్డాయి. దీంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ ఎమ్మెల్యే భూమన కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు త్వరలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి తిరుపతి కార్పోరేషన్ లో మెజార్టీ ఉన్న వైసీపీ చేతుల్లోనే మేయర్ సహా కీలక పదవులు ఉన్నాయి. కానీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్పోరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు కూటమి పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో లడ్డూ వివాదం కూడా తెరపైకి రావడంతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దీంతో కార్పోరేటర్లను కాపాడుకునేందుకు స్థానిక మాజీ ఎమ్మెల్యే భూమన రంగంలోకి దిగారు.

తిరుపతి వైసీపీ కార్పోరేటర్లతో భూమన భేటీ అయ్యారు. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ వారికి దిశా నిర్దేశం చేశారు. ఎన్నో సంక్షోభాలు చూశానని, తనను ఏ పరిస్థితులు బలహీనం చేయలేవని భూమ వ్యాఖ్యానించారు. మూడేళ్ల క్రితం తన కుటుంబ సభ్యులుగా భావించి కార్పోరేటర్లుగా టికెట్లు ఇచ్చి గెలిపించానని వారికి గుర్తుచేశారు. నీడలా ఉన్న వాళ్లు అధికారం పోయాక తనను వీడి పోవడం ఎంతో బాధించిందన్నారు.
ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కల్గిన నేత జగన్ అని, ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే,చంద్రబాబుకి ప్రజలు తాట తీస్తారని భూమన తెలిపారు. వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీ ఎప్పటికీ నిలిచి గెలుస్తుందన్నారు. ఐదేళ్ల పాటు మేయర్ గా శిరీషే కొనసాగుతుందన్నారు. జగన్ లేకుండా మనమంతా గడ్డిపరకలే అని, ఆయన గుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు.
తిరుపతి కార్పొరేషన్ కు కొత్తగా ఇద్దరు డిప్యూటీ మేయర్లు రాబోతున్నారన్నారు. మరో 3 నెలల్లో ప్రభుత్వం పతనం అవుతుందని, భయపడకండి, పోరాడదాం అంటూ వారిలో ధైర్యం నూరిపోశారు. అక్టోబర్ 4వ తేదీన జరిగే కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తామని కార్పొరేటర్లతో భూమన ప్రమాణం చేయించారు.












Click it and Unblock the Notifications