కోటి మృతిపై వెంకయ్య, ఢిల్లీలో జగన్ ధర్నా, చిరు సహా బాధ్యులని అచ్చన్న
హైదరాబాద్/ఢిల్లీ: చిత్తూరు జిల్లా తిరుపతిలో కోటి అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసిన ఘటన పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. తిరుపతి ఆత్మహుతికి పాల్పడటం దురదృష్టమన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. దీనిని తాము రాజకీయం చేయదల్చుకోలేదని చెప్పారు.
ప్రజలంతా సంయమనం పాటించాలన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్, ఇప్పుడు దీనిని రాజకీయం చేస్తోందన్నారు. వారు విభజన చేసే సమయంలో ప్రత్యేక హోదాను చట్టంలో ఎందుకు పొందుపర్చలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ తీరా విభజన చట్టంలో దానిని పొందుపర్చలేదన్నారు. విభజన చట్టంలో కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల ఇప్పుడు తిరుపతిలో దురదృష్ట ఘటన చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు. హోదాను అప్పుడే చేర్చితే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.

ప్రత్యేక హోదా కోసం జగన్ ధర్నా
ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ అధ్యక్షులు జగన్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. ఉదయం 10 గంటలకు దేశ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు.
ఏపీలోని అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ కూడా ఆదివారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని అన్ని పక్షాలు కోరుతున్నాయి.
కాంగ్రెస్ పైన అచ్చెన్నాయుడు నిప్పులు
అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్... ఇప్పుడు ఏపీలో తనను తాను బతికించుకునేందుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం ధ్వజమెత్తారు. మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ఏ ఒక్కరూ లేరన్నారు.
ప్రత్యేక హోదాను సాధించి తీరుతామన్నారు. ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దనన్నారు. మునికోటి మరణం దురదృష్టకరమన్నారు. వైసీపీ అధినేత జగన్ పైనా మండిపడ్డారు. కేవలం రాజకీయ స్వార్థంతోనే ఢిల్లీలో జగన్ దీక్ష చేపడుతున్నారన్నారు.
మునికోటి మరణానికి ఏపీ కాంగ్రెస్ నేతలే కారణమని టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అవగాహన లేని కాంగ్రెస్ నేతలు భావోద్రేకాలను రెచ్చగొట్టారని అందువల్లే మునికోటి బలవన్మరణానికి పాల్పడ్డాడన్నారు.
దీనికి బాధ్యులైన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీలు చిరంజీవి, జేడీ శీలం, మాజీ మంత్రి శైలజానాథ్, తులసి రెడ్డి, సి రామచంద్రయ్య తదితరులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్న తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో వీరు చెలగాటమాడుతున్నారన్నారు.
మునికోటి సోదరుడికి రాహుల్ ఫోన్
మునికోటి సోదరుడికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. మునికోటి కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మునుకోటి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. మునికోటిని కాపాడబోయి గాయాలబారిన పడిన శేషాద్రి ఆరోగ్యంపై వాకబు చేశారు.












Click it and Unblock the Notifications