పవిత్ర తిరుపతిలో ముంతాజ్ హోటల్స్‌పై తేల్చేసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
Tirupati Mumtaz Hotel row: ఆధ్యాత్మిక నగరి, టెంపుల్ టౌన్ తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ నిర్మాణం వ్యవహారం కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తూ వస్తోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలకు వెళ్లే మార్గంలో అలిపిరి సమీపంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం శరవేగంగా సాగుతోండటం దీనికి ప్రధాన కారణం.
హిందువుల మనోభావాలకు విరుద్దంగా అలిపిరి జూపార్క్ రోడ్డులో నిర్మితమౌతోన్న ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి, రాయల్ పీపుల్ ఫ్రంట్ అధ్యక్షుడు తుమ్మా ఓంకార్, రెడ్డి శేఖర్ రాయల్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు ఇదివరకే డిమాండ్ చేశారు.

టీటీడీ, తిరుపతి పవిత్రతను దెబ్బతీయడానికి గత ప్రభుత్వం దేవలోక్‌లో 60 ఎకరాల్లో 20 ఎకరాలు ముంతాజ్ హోటల్స్‌కు కేటాయించిందని ఆరోపించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఈ 20 ఎకరాల్లో వంద విల్లాలను ముంతాజ్ హోటల్ యాజమాన్యం నిర్మించనుందని, అక్కడ విచ్చలవిడిగా మద్యం, మాంసం లాంటి విష సంస్కృతిని పెంపొందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని వాళ్లు మండిపడ్డారు. ఈ హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
దీనిపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అలిపిరి సమీపంలో దేవలోకం పేరుతో ఓ భారీ పర్యాటక ప్రాజెక్ట్‌ను నిర్మించ తలపెట్టిందని, దీనికోసం అప్పట్లో 60 ఎకరాలను కేటాయించిందని అన్నారు.
#WATCH | Hyderabad, Telangana: On TTD board passing a resolution asking the state govt to cancel allotment of 20 acres of land near Alipiri to build Mumtaz Hotel, TTD chairman BR Naidu says, "When Chandrababu Naidu was the CM, the original project at that time was… pic.twitter.com/zwaGjQY9kd
— ANI (@ANI) November 19, 2024
2019 తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దీన్ని మార్చివేసిందని, దేవలోకం ప్రాజెక్ట్‌కు కేటాయించిన 60 ఎకరాల్లో 20 ఎకరాలను ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిందని, మళ్లీ ఈ వివాదం తెర మీదికి వచ్చిన నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలని తీర్మానించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.
ఈ తీర్మానాన్ని టీటీడీ పాలక మండలి సమావేశంలో సైతం ఆమోదించామని ఆయన అన్నారు. ముంతాజ్ హోటల్స్‌కు కేటాయించిన స్థలం లీజును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోన్నామని చెప్పారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. ఆ స్థలాన్ని మళ్లీ టీటీడీకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications