తిరుపతి తొక్కిసలాట ప్రమాదం కాదు: ఎఫ్ఐఆర్ కాపీని చూపించిన రోజా..
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తిరుపతిలోని పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్‌నారాయణ్ రూయా ఆసుపత్రులకు తరలించారు.

ఈ ఘటన పట్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.
తొక్కిసలాట ఘటనను ప్రభుత్వ హత్యలుగా రోజా అభివర్ణించారు. ఇది ప్రమాదావశావత్తూ జరిగిన ఘటన ఎంతమాత్రం కాదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్ర పవన్ కల్యాణ్ నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
చంద్రబాబు నియమించిన టీటీడీ పాలకవర్గం, దేవాదాయం, హోం శాఖ మంత్రి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, వీళ్లందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రోజా డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో దీన్ని పోల్చారామె. ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్ కాపీని విలేకరుల సమావేశంలో చూపించారు.
పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోను చూడటానికి అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్తే ఆయనకు సంబంధం లేకుండా తోపులాట జరిగిందని, రేవతి అనే మహిళ చనిపోయిందని గుర్తు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై భారత్ న్యాయ సంహిత 105 కింద కేసు పెట్టారని రోజా పేర్కొన్నారు.
అలాంటిది- వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల కోసం లక్షలాది మంది వస్తారని తెలిసి, అక్కడ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ చంద్రబాబు దగ్గరి నుంచి టీటీడీ ఛైర్మన్, పాలక మండలి, జిల్లా ఎస్పీ వరకు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని రోజా చెప్పారు. అలాంటిది- ఎఫ్ఐఆర్‌లో 194 బీఎన్ఎస్ కింద కేసు పెట్టి చేతులు దులిపేసుకున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications