కొలికపూడి శ్రీనివాసరావుకు షాక్..పేరుకు ఎమ్మెల్యే చేసేవి మాత్రం..!!
తిరువూరు:పేరుకు ఆయన ఎమ్మెల్యే... అది కూడా తొలిసారిగా ఎన్నికయ్యారు. అలాంటప్పుడు ఎలా ఉండాలి.. ప్రజలకు అండగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి... తానే ఆ నియోజకవర్గ ప్రజలకు సమస్యగా మారాడు. రోజులు మారాయన్న సంగతి మరిచారు. చివరికి ఆ సొంత నియోజకవర్గ ప్రజలే రోడ్డెక్కి ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా నినదించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఆయన చేసిన ఘనకార్యం ఏమిటి..?
కొలికపూడి లీలలు
కొలికపూడి శ్రీనివాసరావు.. తిరువూరు ఎమ్మెల్యే. ఇలా అయితే కాస్త గుర్తుపట్టడం కష్టమే కానీ.. అమరావతి అనే కాన్సెప్ట్ వస్తే చాలు టపీమనీ టీవీల ముందు చర్చాకార్యక్రమాలకు హాజరవుతారు.ఒక ఆకుపచ్చని తలపాగా ధరించి డిబేట్లలో ఎగిరెగిరి రెచ్చిపోతారు. ఇప్పుడు కచ్చితంగా గుర్తుకు వచ్చే ఉంటుంది. యస్.. ఆయనే ఈ కొలికపూడి శ్రీనివాసరావు. ఈయన చర్చాకార్యక్రమాలు, వాగ్ధాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించిన చంద్రబాబునాయుడు పిలిచి టికెట్ ఇస్తే చివరాకరకు ఆయన చేసిన ఘనకార్యమేంటంటే మహిళలపై లైంగిక వేధింపులు. సమస్యను చెప్పుకుందామని వెళ్లిన మహిళలకు ఈయనగారి నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతుండటంతో వారు మింగలేక కక్కలేక చాలా ఆవేదనకు గురయ్యారు. ఇక ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తిస్తుండటంతో కొలికపూడికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు ఆ నియోజకవర్గ ప్రజలు, సొంత పార్టీ కార్యకర్తలు.

పేకాట శిబిరాల్లో వాటాలపై...
అసలు విషయానికొస్తే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీను ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయి. అధికారం చేతిలో ఉందికదా అని రెచ్చిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేకాట శిబిరాల ఏర్పాటులో అయ్యగారు ఎక్కువ వాటా డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇవ్వకుంటే భాగస్వామిపై కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారట. ఈ మధ్యే తుమ్మలపల్లి శ్రీనివాసరావు అలియాస్ చిట్టేల శీను అనే సర్పంచ్‌తో బేరం కుదరక కొలికపూడి పగబట్టారని ఆయన భార్య ఆవేదన చెంది ఆత్మహత్యకు యత్నించారు. అలానే ఎ.కొండూరుకు చెందిన దాడి రామారావు కొలికపూడి ఎన్నికల కోసం రూ.కోటి ఇచ్చారని సమాచారం. ఎమ్మెల్యే అయ్యాక కొలికపూడి రూ.20లక్షలు మాత్రమే ఇచ్చి దిక్కున్న చోటు చెప్పుకోమని అన్నారట. అంతేగాదు ఎమ్మెల్యే కుటుంబం సింగపూర్ పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు దాడి రామారావు కుటుంబ సభ్యులు చేస్తే.. అసలు రామారావు ఎవరో తెలియదని ఫోను పెట్టేసినట్లు టీడీపీ వర్గాలు నియోజకవర్గంలో గుసగుసలాడుతున్నాయి.
మహిళలకు లైంగిక వేధింపులు
మహిళలు సమస్యలు చెబుదామని ఎమ్మెల్యే కొలికపూడి దగ్గరకు వెళితే వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇక ఆగడాలు మితిమీరిపోయిన నేపథ్యంలో ఇటు కార్యకర్తల్లో అటు సామాన్య ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీరంతా రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే కొలికపూడిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ స్థానిక టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలే ఇప్పుడు ఛీ అని అంటున్నారు. అసలు కొలికపూడి తమకు ఎమ్మెల్యేగా వద్దంటూ బాహాటంగానే చెప్పేస్తున్నారు.ఎమ్మెల్యే కొలికపూడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని వారు నినదించారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్..
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కొలికపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరింది. అసలు ఆయన పనితీరు, ఆయన నియోజకవర్గం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు అనేదానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయసేకరణ చేసినట్లు సమాచారం. ప్రజలంతా కొలికపూడికి వ్యతిరేకంగా ఓటువేసినట్లు తెలుస్తోంది.ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ అభిప్రాయ సేకరణ అధినేత చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలుస్తోంది. పార్టీ షోకాజ్ నోటీసులు కొలికపూడికి జారీచేసే అవకాశాలున్నట్లు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యే అవగానే కొలికపూడికి కొమ్ములొచ్చాయని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు.కొలికపూడిని అనవసరంగా గెలిపించుకున్నామనే బాధ అక్కడి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఎంతవరకు వెళుతుందో.. అధినేత చంద్రబాబు కొలికపూడి కొమ్ములు విరిచేస్తారా..లేదా అనేది తెలియాలంటే కొంత సమయం వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications