కొత్త వివాదంలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి.. మార్పు రాదా ?
మనిషికో మాట..గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ ఎన్నిసార్లు చెప్పిన మారని మనిషిని ఏం అంటారో.. ఏం అనాలో కొన్ని సార్లు మాటలు కూడా రావు. అదే వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఇంకెంత బాధ్యతగా ఉండాలి. అదృష్టం కొద్ది అనుకోని సంఘటనలతో వైరల్ గా మారి.. అధినేత ఆశీస్సులతో టికెట్ పొంది.. కూటమి స్వింగ్ లో ఎమ్మెల్యే అయిన ఆ నేతకి.. అధికారం వచ్చాక.. ఏం విడ్డూరమైన వ్యాధి సోకిందో తెలియయడం లేదు కానీ.. ఆ ఎమ్మెల్యే గురించి నియోజకవర్గ ప్రజలే కాకుండా.. రాష్ట్ర ప్రజలు సైతం గుసగుసలు ఆడుకుంటున్నారు. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం.. కానీ తప్పులు చేయడమే నా హాబీ.. వివాదాలే నా పని అంటూ పేట్రేగిపోతున్నారు ఈ ఎమ్మెల్యే. గత కొద్ది రోజులుగా పార్టీకి తలనొప్పిగా మారిన ఆయన వ్యవహారం ఇప్పుడు ఇంకాస్త గుదిబండగా తయారైంది. ప్రజలకు పనిచేయవయ్యా బాబు అని అదిష్టానం పిలిచి మరీ మొట్టికాయలు వేసినా.. నా దందా ఇంతే, ఇదే నా స్టైల్ అంటూ మరోసారి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు ఆ వివాదపాటి.....
ఆయనే తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తాజాగా కొలికపూడి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక పార్టీ కార్యకర్త డేవిడ్.. గురువారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్టీ కోసం కష్టపడిన తనను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆత్మహత్యాయత్నానికి ముందు డేవిడ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రస్తుతం అతను విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డేవిడ్ సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడియో బయటకు రాకుండా కొలికపూడి అందరినీ బెదిరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎ.కొండూరు మండలం కంభంపాడులో అక్రమ నిర్మాణం అంటూ ఓ ఇంటిని ఎమ్మెల్యే జేసీబీతో కూల్చివేయించారు. ఆ సమయంలో కారుపై కూర్చుని ఆందోళనలకు దిగడం వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత చిట్యాలలో సర్పంచ్ ను ఎమ్మెల్యే తిట్టారని వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దీంతో అప్పట్లోనే కొలికపూడిపై అధిష్టానం సీరియస్ అయింది. ఇదే సమయంలో కొలికపూడి కూడా తిరువూరులో ర్యాలీ పెడుతున్నట్లు ప్రకటన చేయడం మరింత చర్చకు దారి తీసింది. అయితే అధిష్టానం జోక్యం చేసుకుని ర్యాలీని విరమింపజేసింది.
ఆ తర్వాత గోపాలపురంలో టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి కొలికపూడి వెళ్లారు. గ్రామంలో రాంబాబుకు ఆయన సోదరుడు వైసీపీ నేత భూక్యా కృష్ణకు మధ్య చాన్నాళ్లుగ ఆస్తి తగాదాలు ఉన్నాయి. సీసీ రోడ్డు తన స్థలంలో వేశారని.. వివాదం తేలేవరకు రోడ్డును ఎవరూ వినియోగించకూడదని.. దానిపై కంచె వేశారు కృష్ణ. రాంబాబు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి కృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఇక ఎమ్మెల్యే వర్గం తనపై, తన భర్తపై దాడికి పాల్పడ్డారంటూ కృష్ణ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో ఈ ఘటనతో మరోసారి కొలికపూడి తీరుపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.
ఈ ఘటనపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. క్రమశిక్షణా కమిటీ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ వివరణ తీసుకున్నారు. కానీ మళ్లీ ఇప్పుడు కొత్తగా మరో వివాదంలో చిక్కుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications