రష్యా దాడితో ఉక్రెయిన్ అతలాకుతలం; సాయం కోరిన జెలెన్ స్కీ.. టెటానిక్ ఫేం లియోనార్డో భారీ విరాళం !!
ఉక్రెయిన్‌పై దాడులను రష్యా సేనలు మరింత పెంచాయి. ఒకవైపు కాల్పులు విరమణ అని ప్రకటించి మరో వైపు భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. రష్యా సేనల దాటికి ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. ఎక్కడ చూసినా భయానక పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. కూలిన భవనాలు, రోడ్లపై శవాలు, ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఏప్రాంతానికి వెళ్లినా హృదయవిదారకర దృశ్యాలే దర్శనమిస్తున్నాయి.

ప్రపంచబ్యాంకు 723 మిలియన్ డాలర్ల సాయం
రష్యా దాడులతో ఉక్రెయిన్‌కు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో తమకు సాయం అందించాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వేడుకున్నారు. మాస్కో దురాక్రమణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ సమాజం అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. అత్యవసర నిధికింద సుమారు 723 మిలియన్ డాలర్ల భారీ సాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను ఉక్రెయిన్ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, సంక్షేమ కార్యక్రమాల కోసం అందిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది.

బ్రిటన్ 400 మిలియన్ పౌండ్ల సాయం
ఉక్రెయిన్ ప్రజలకు అంతర్జాతీయ సమాజం అండగా నిలవాల్సిన అవరసం ఉందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. రష్యా దురాక్రమణ చర్యలతో ఉక్రెయిన్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా నిలిచేందుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశానికి భారీ ఆర్థికసాయాన్ని ప్రకటించారు. దాదాపు 175 మిలియన్ పౌండ్లను అందించనున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఉక్రెయిన్‌కి 400 మిలియన్ పౌండ్లను బ్రిటన్ సాయం అందించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పౌరులను తక్కువగా అంచనా వేసి భంగపడ్డారని విమర్శలు గుప్పించారు. పుతిన్ అంచనాలు తల్లకిందులైయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లియోనార్డో 10 మిలియన్ డాలర్ల విరాళం
మరోవైపు హాలీవుడ్ నటుడు, టెటానిక్ ఫేం లియోనార్డో డికాప్రియో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచారు. ఉక్రెయిన్‌కు తనవంతు సాయాన్ని ప్రకటించారు. సుమారు 10 మిలియన్ డాలర్లు విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. డికాప్రియో అమ్మమ్మ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించింది. అందుకే తన వంతు సాయంగా ఉక్రెయిన్‌కు విరాళం అందించారు. ఈ విరాళం విషయాన్ని రహస్యంగా ఉంచాలని లియోనార్డో ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ వైస్ గ్రాడ్ ఫండ్ సంస్థ తాజాగా తెలిపింది.












Click it and Unblock the Notifications