రాయలసీమకు వాతావరణశాఖ భారీ హెచ్చరిక
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతోపాటు రాయలసీమపై తుపాను సుడిగుండం లాంటిది ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ భారతదేశం మొత్తం ద్రోణి విస్తరించివుందని, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వారం రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఏపీలో గాలి వేగం గంటకు 15 కిలోమీటర్ల వరకు ఉందని, తెలంగాణలో 10 కిలోమీటర్లుగా ఉందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోను ఉష్ణోగ్రతులు బాగానే నమోదయ్యే అవకాశం ఉంది.
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. గాలిలో తేమ శాతం ఏపీలో సాయంత్రానికి 74 శాతంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, ఏలూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరంతోపాటు శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవడానికి అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఎండలతోపాటు ఉక్కపోత వాతావరణం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతోపాటు ఎండలు, ఉక్కపోత వాతావరణంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆగస్టు నెలలో ఏపీలో సాధారణ వర్షపాతం కూడా నమోదవలేదు. నెల ముగియడానికి ఇంకా పది రోజుల సమయం ఉండటంతో వర్షాలు కురుస్తాయనే ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications