బాబు ఏపీ ఎఫెక్ట్: టీలో కేసీఆర్‌పై ఒత్తిడి, పోలవరంపై...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అరవయ్యేళ్లకు పెంచాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవయ్యేళ్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు సైతం దీని కోసం డిమాండ్ చేస్తున్నారు.
టీఎన్జీవో భవన్‌లో ఆదివారం సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఉద్యోగుల పదవీ వివరణ వయో పరిమితిని అరవైకి పెంచాలని డిమాండ్ చేసింది.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగుల పంపిణీ, పోలవరం ఆర్డినెన్స్, ఉద్యోగుల వయో పరిమితి పెంపు, వేతన సవరణ సిఫారసుల అమలు తదితర అంశాలపై చర్చించినట్టు సమావేశం అనంతరం దేవిప్రసాద్ తెలిపారు. తమ రాష్ట్ర కార్యవర్గం చేసిన డిమాండ్లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు. తమ సర్వీసుల క్రమబద్ధీకరణకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంతో ఆశగా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
వచ్చే కేబినెట్ భేటీలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలని ఎన్జీవో సంఘం డిమాండ్ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నట్టు దేవిప్రసాద్ తెలిపారు. ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులు అందరికీ హెల్త్ కార్డులు తక్షణం అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం ఆర్డినెన్స్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసిన ఏడు మండలాలల్లో ఉద్యోగులు వేలాదిమంది ఉన్నారని, వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని టీఎన్జీవో ఆందోళన వ్యక్తం చేసింది. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా జెఎసి చేపట్టే ఆందోళనలకు టీఎన్జీవోల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటిస్తోన్నట్టు తెలిపారు. పోలవరం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళనలను ఉద్ధృతం చేయనున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications