ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ- టాలీవుడ్ సీనియర్ రచయిత ప్రకటన..
ఏపీలో వచ్చే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. వీటిలో అధికార వైసీపీ సింగిల్ గా, విపక్ష పార్టీలు పొత్తులతో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరికొన్ని విపక్ష పార్టీలు ఒంటరి పోరుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో కొత్తగా పలు రాజకీయ పార్టీలు కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ రచయిత జొన్నవిత్తుల ఇవాళ తన రాజకీయ పార్టీని ప్రకటించారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టాలీవుడ్ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇప్పటివరకూ ఏ పార్టీ చేయని విధంగా భాషా ప్రాతిపదికన ఈ రాజకీయ పార్టీని ప్రకటించారు. దీని పేరును జై తెలుగు పార్టీగా వెల్లడించారు. త్వరలో అధికారికంగా దీన్ని ప్రారంభించబోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఈ రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో నాయకులు, ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకే తాను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు టాలీవుడ్ లిరిసిస్ట్ జొన్నవిత్తుల ప్రకటించారు. తెలుగు భాషకు పునర్ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా తన రాజకీయ పార్టీ పనిచేయబోతోందని ఆయన వెల్లడించారు. తెలుగు భాష పరిరక్షణ అజెండాగా వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లలో పోటీచేయబోతున్నట్లు జొన్నవిత్తుల పేర్కొన్నారు. అయితే ఈ పార్టీని ఇంకా రిజిస్టర్ చేయించారా లేదా అన్నది స్పష్టత లేదు.
ఏపీలో ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు పలు పార్టీలు వచ్చే ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి. ఇప్పుడు జై తెలుగు పార్టీ కూడా రిజిస్టర్ అయితే ఎన్నికల సంఘం కామన్ గుర్తు ఇస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి శూన్యత లేని నేపథ్యంలో జై తెలుగు పార్టీ పేరుతో జొన్నవిత్తుల ఓట్లను చీల్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications