ఏపీలో టమోటా ధరలు.. అంతే
మొన్నటివరకు టమోటా పేరు చెబితే.. అది లేకపోయినా పర్వాలేదులే.. వేరే కూర వండుకుందాం అని సర్దుకుపోయేవారు. అంతగా ధరలు బెంబెలెత్తించాయి. తాజాగా టమోటా ధరల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. కేజీ రూ.200 అమ్మిన దగ్గర నుంచి కిలో రూ.9కి పడిపోయింది. ఈ లెక్కన కిలోకు తమకు రూ.7 అందుతాయని, రూ.2 కమీషన్ గా పోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు వారాల క్రితం వరకు చేతినిండా డబ్బులుండేవని, ఇప్పుడు మాత్రం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి బయ్యర్లు రాకపోవడంతోపాటు ఎగుమతి చేసేందుకు ట్రేడర్లు కూడా ముందుకు రావడంలేదు. దీంతో ఒక్కసారిగా టమోటాకు డిమాండ్ పడిపోయింది. కొన్ని మార్కెట్లలో కేజీ రూ.15 నుంచి రూ.20 మధ్యన అమ్మకాలు జరుగుతున్నాయి.

రాయలసీమలోని చిత్తూరు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా టమోటా దిగుబడులు ప్రారంభమయ్యాయి. దీంతో డిమాండ్ తగ్గింది. పొరుగునే ఉన్న అనంతపురం జిల్లాతోపాటు కర్ణాటకలో కూడా టమోటా సాగు పెరిగింది. డిమాండ్ కు తగినట్లుగా దిగుబడి కూడా పెరుగుతుండటంతో వీటిని కొనుగోలు చేసేవారు కరువైపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు ఏపీకి వచ్చి మరీ కొనుగోలు చేసివెళ్లేవారు. కానీ ఇప్పుడు ధరలు తగ్గిపోవడంతో ఇటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. మొన్నటివరకు కాసులు కురిపించిన టమోటాలు.. తగ్గిన ధరలతో రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. పండించడానికి అయిన ఖర్చులు కూడా రావడంలేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications