Amaravati Land scam:సీఎం జగన్ చేతికి చిక్కిన మాజీ మంత్రి..ఆధారాలతో సహా..వాట్ నెక్ట్స్..?
అమరావతిలో జరిగిన భూ కుంభకోణం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని పైన నాడు సీఆర్డీఏ లో కీలకంగా పని చేసిన ఐఏఎస్ అధికారిని సీఐడి అధికారులు విచారించారు. ఆ సమయంలో పలు కీలక విషయాలు ఆయన వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ కీలకంగా మారుతున్నారు. రాజధాని ప్రాంత భూముల వ్యవహారం లో గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు నాటి మంత్రులు నారాయణ, పుల్లారావుల ఒత్తిడే కారణమని సీఐడీకి ఆ ఐఏఎస్ వెల్లడించినట్టు తెలుస్తోంది.

రెవిన్యూ రికార్డులను రహస్యంగా...
సీఆర్డీఏ ఏర్పాటుకు ముందుగానే తుళ్లూరులోని భూముల వివరాలను, రెవెన్యూ రికార్డులను నాటి మంత్రి నారాయణ తీసుకున్నారని ఆ అధికారి సీఐడీ దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. అసైన్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ భూముల విషయంలో జరుగుతోన్న తప్పిదాలను నారాయణ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదంటూ సీఐడి ముందు ఆ ఐఏఎస్ చెప్పినట్లు తెలుస్తోంది.
గతంలో రెవిన్యూ రికార్డ్ లను మాయంకావడం పైనా అధికారులకు ఐఏఎస్ వివరణ ఇచ్చినట్లు సమాచారం. 2015లో ల్యాండ్ పూలింగ్ కు ముందే 2014 అక్టోబర్ లో తుళ్లూరు మండలం రెవెన్యూ రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారని ఆ ఐఏఎస్ అధికారి చెప్పారని తెలుస్తోంది.

రాజధాని భూములు
తిరిగి ఒరిజినల్స్ ను తుళ్లూరు ఎమ్మార్వోకు ఇవ్వాల్సి ఉన్నా.. వాటిని గుంటూరు కలెక్టరేట్ లోనే ఉంచారని ఆయన విచారణ సమయంలో వెల్లడించినట్లు చెబుతున్నారు. అనంతరం ఏపీసీఆర్డీఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చారంటూ ఆయన చెప్పారని తెలుస్తోంది. రాజధాని నగర పరిధిని నిర్ణయించడం కోసం సీఆర్‌డీఏ కమీషనర్ ,గుంటూరు కలెక్టర్, గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించచడం జరిగిందని విచారణ సమయంలో ఆ ఐఏఎస్ అధికారి వివరించారు.
2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ పథకం ప్రక్రియ ప్రారంభమైందని..అసైన్డ్ భూముల సేకరణపై జివో 41 ని తీసుకొచ్చారని వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారం మొత్తం మాజీ మంత్రి నారాయణ పర్యవేక్షించారంటూ చెప్పుకొచ్చారు.

అధికారులు నిర్ణయాధికారులు కాదంటూ...
ఏపీ అసైన్డ్ లాండ్ యాక్ట్ 1977 కి విరుద్దంగా ఉన్న అంశాలను మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లామని..చట్టవ్యతిరేకమని ముందే చెప్పిన నారాయణ వినిపించుకోలేదని ఐఏఎస్ విచారణ సమయంలో వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. 2016 ఫిబ్రవరి 16న భూసేకరణలో రిటనబుల్ ప్లాట్స్ ఇచ్చే ప్రక్రియను మంత్రి నారాయణ ప్రకటించారని చెప్పినట్లు తెలుస్తోంది.
జీవో జారీకి ముందే కొన్ని ప్రతిపాదనలు చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు మంత్రి నారాయణకు తెలిపానంటూ విచారణలో వెల్లడించారని సమాచారం. అధికారులు నిర్ణయాధికారులు కాదు, మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న ఇతర అధికారులు మాత్రమే నిర్ణయాలను అమలు చేస్తారని తనతో మంత్రిగా నారాయణ అన్నారంటూ ఆ ఐఏఎస్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఏపీ హైకోర్టులో పిటిషన్లు
ఆ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగిందంటూ ఆ ఐఏఎస్ స్పష్టత ఇచ్చారని సమాచారం. ఐఏఎస్ అధికారి కీలక విషయాలు బయటపెడుతుండటంతో మంత్రి నారాయణ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..హైకోర్టులో విచారణకు అనుమతి కోరుతూ సిఐడి కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం తో రాజధాని భూములు వ్యవహారం కొత్త టర్న్ తీసుకొనే ఛాన్స్ ఉంది. అయితే, ఇప్పటికే ఈ భూముల వ్యవహారం పైన సుప్రీం కోర్టు..హైకోర్టుల్లో వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications