నీట్ రీటెస్ట్‌లోనూ అవకతవకలు.. మెడికల్ స్టూడెంట్స్‌తో సహా 24 మంది అరెస్ట్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం అనంతరం ఆదివారం దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థుల కోసం నిర్వహించిన నీట్-యూజీ రీటెస్ట్‌లో కూడా అక్రమాలకు తెరలేపిన ఓ పెద్ద ముఠా గుట్టును బీహార్ పోలీసులు రట్టు చేశారు. అభ్యర్థులకు బదులుగా పరీక్షలు రాసేందుకు ఇతరులను రంగంలోకి దించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో భాగంగా ఏకంగా 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో టాప్ మెడికల్ కాలేజీలకు చెందిన ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులతో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీ ఉద్యోగులు కూడా ఉండటం దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేస్తోంది.
ఈ ముఠా వెనుక గయాకు చెందిన ఏఎన్ఎం మెడికల్ కాలేజీ విద్యార్థి అర్పిత్ రాజ్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అర్పిత్ రాజ్‌ను గతంలో జరిగన 2024 నీట్ పేపర్ లీక్ కేసులో కూడా సీబీఐ విచారించడం గమనార్హం. అలాగే పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మయాంక్ కశ్యప్ అనే మరో మెడికల్ స్టూడెంట్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా ప్రక్రియలో భాగమైన ఓ బయోమెట్రిక్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హసన్‌పూర్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలోకి మయాంక్ కశ్యప్ బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగి లాగా మారువేషంలో ప్రవేశించడంతో ఈ భారీ నెట్వర్క్ గుట్టు వెలుగులోకి వచ్చింది. ఇతడిని పట్టుకున్న అనంతరం లఖిసరాయ్‌లోని కేఆర్‌కే హయ్యర్ సెకండరీ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఏడుగురు నకిలీ అభ్యర్థులతో పాటు ఆపరేషన్‌కు సహకరించిన పలువురిని అరెస్ట్ చేశారు. లోపల ఉన్న ఇన్సైడర్స్ సాయంతో అసలు అభ్యర్థుల స్థానంలో చదువుకున్న మెడికల్ విద్యార్థులను కూర్చోబెట్టి ఎగ్జామ్ మేనేజ్ చేయడమే ఈ గ్యాంగ్ ప్లాన్ అని విచారణలో తేలింది.
ఈ దర్యాప్తులో బనారస్ హిందూ యూనివర్సిటీ నర్సింగ్ విద్యార్థిని పూనమ్ కుమారి మరొకరి స్థానంలో పరీక్ష రాస్తూ దొరికిపోయింది. అలాగే ఎయిమ్స్ రాయ్‌బరేలీ విద్యార్థి సౌరభ్ ఝా, ఢిల్లీలోని షాదరా మెడికల్ కాలేజీ ఇంటర్న్ అమన్ అగర్వాల్, నలంద మెడికల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థి సంజీత్, అతని సోదరుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నీట్ పరీక్షల సమయంలో మెడికల్ విద్యార్థులు ఎవరూ క్యాంపస్ వదిలి వెళ్లకూడదని, వారిపై నిఘా పెట్టేందుకు కాలేజీలు క్విజ్, సెమినార్లు నిర్వహించినప్పటికీ.. అనారోగ్యం నెపంతో మయాంక్ కశ్యప్ లాంటి విద్యార్థులు తప్పించుకుని వచ్చి ఇలాంటి దందాలకు పాల్పడటం విద్యావ్యవస్థను కలవరపెడుతోంది. ప్రస్తుతం బీహార్ పోలీసులు ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న మరికొంతమంది కోసం వేట సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications